ట్యాక్స్‌.. తగ్గించడానికి టాక్స్‌ | - | Sakshi
Sakshi News home page

ట్యాక్స్‌.. తగ్గించడానికి టాక్స్‌

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

పన్ను విధింపులో చేతివాటం

అడిగినంత ఇస్తే తక్కువ వచ్చేలా నమోదు

నగర పాలక సంస్థ ఆదాయానికి గండి

కాకినాడ లీగల్‌: నగరంలో ఖాళీ స్థలాలకు, రేకుల షెడ్లకు, భవనాలకు పన్ను విధింపులో కొంత మంది రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంతా ఇచ్చుకుంటే తక్కువ పన్ను వచ్చేలా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ నగర పాలక సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఇంటి నిర్మాణం పూర్తి చేసి, స్వర్ణ వార్డు (సచివాలయం) కార్యాలయానికి వెళ్లి పన్ను వేయాలని దరఖాస్తు అందజేస్తే.. వార్డు అడ్మిన్‌ పరిశీలించి, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆవిధంగా ఎవరైనా వస్తే ముందుగా నగర పాలక సంస్థ రెవెన్యూ అధికారులను కలిసి రావాలని కొంత మంది స్వర్ణ వార్డు సిబ్బంది చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకుంటేనే వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారని కొందరు యజమానులు వాపోతున్నారు. అదే సమయంలో భవనం విస్తీర్ణం తగ్గించి చూపించినా.. ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు ఉన్నట్లు చూపినా.. పన్ను తక్కువగా వస్తుందని చెబుతున్నారని అంటున్నారు. అయితే, ఇందుకు ఇందుకు కొంత ముట్టజెప్పాల్సిందేనంటూ బాహాటంగానే బేరసారాలకు దిగుతున్నట్లు తెలిసింది.

అంతా అడ్డగోలు వ్యవహారం

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. పట్టణాల్లో పన్ను వేయని ఇళ్లకు కొత్తగా పన్ను విధించాలని, ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న ఇళ్లు, భవనాల విస్తీర్ణంలో తేడాలుంటే సవరించాలని నగర పాలక సంస్థ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే, నగరంలో ఈ ప్రక్రియను మొక్కుబడిగా చేపట్టి చేతులు దులుపుకొన్నారు.

● మధురా నగర్‌లోని ఒక ఇంటికి గ్రౌండ్‌ ఫ్లోర్‌ ఉండగా దాని పైన మరో అంతస్తుకు అనుమతి తీసుకుని నిర్మాణం చేపట్టారు. సిబ్బంది గ్రౌండ్‌ ఫ్లోర్‌కు మాత్రమే పన్ను వేశారు. సుమారు రెండేళ్లవుతున్నప్పటికీ మొదటి అంతస్తుకు పన్ను వేయలేదు.

● గాంధీనగర్‌ సుబ్బారావు వీధిలో 100 గజాల స్థలం విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు రూ.30 లక్షలు. ఆ స్థలంలో రేకుల షెడ్డుకు 2023 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకూ రెండేళ్లకు రూ.54 మాత్రమే పన్ను విధించారు.

● కొత్తగా నిర్మించిన భవనాలకు ఇతర కారణాలు చూపి పన్నులు వేయడం లేదు.

● ఆస్తి రిజిస్ట్రేషన్‌ అయిన తరువాత పన్ను మార్చాలన్నా, కొత్త ఇంటికి పన్ను వేయాలన్నా.. అనేక ఇబ్బందులు పెట్టి, అదనపు సొమ్ము గుంజుతున్నారని, ఆ తర్వాతే ఫైల్‌ ముందుకు వెళ్తోందని బహిరంగంగానే పలువురు ఆరోపిస్తున్నారు.

● ఈవిధంగా చేసేందుకు సంబంధిత యజమానుల నుంచి పెద్ద మొత్తంలో దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ అవకతవకలతో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు

నగర పాలక సంస్థలో రెవెన్యూ విభాగంలో 2025 నవంబర్‌ వరకూ రెవెన్యూ అధికారి (ఆర్‌ఓ) పోస్టులు రెండు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) పోస్టులు ఐదు ఉండేవి. అయితే, పరిపాలన సౌలభ్యం, పన్ను బకాయిలు వసూలు పేరుతో గతంలో పని చేసిన ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెంచారనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే రెండు సర్కిళ్లలో ఇద్దరు ఆర్‌ఓలుండగా, సర్కిళ్లను మూడుకు పెంచి, అదనంగా మరో ఆర్‌ఓను నియమించారు. అలాగే, ఆర్‌ఐల సర్కిళ్లు ఐదు ఉండగా వాటిని ఏడుకు పెంచి, ఏడుగురు ఆర్‌ఐలను నియమించారు. ఇలా పోస్టులు పెంచడం వెనుక పెద్ద మొత్తంలో వ్యవహారం జరిగిందని, ఆదాయం వచ్చే ప్రాంతాల్లో కావలసిన అధికారిని నియమించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అటువంటి వారిపై చర్యలు

నగర పాలక సంస్థకు పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి నష్టం కలిగించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. గతంలో రెవెన్యూ విభాగంలో అదనపు పోస్టింగ్‌ల నియామకంపై విచారణ జరుగుతోంది.

– ఎన్‌వీవీ సత్యనారాయణ, ఇన్‌చార్జి

కమిషనర్‌, నగర పాలక సంస్థ, కాకినాడ

కాకినాడ నగరం (ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement