బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. దీనికోసం జల్‌జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 3,79,185 ఇళ్లకు గాను ఇప్పటి వరకూ 2,96,777 ఇళ్లకు తాగునీరు అందించామన్నారు. మిగిలిన పనులను ప్రణాళిక ప్రకారం గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులన్నింటినీ నీటితో నింపాలన్నారు. డ్రైనేజీల్లో ఉన్న తాగునీటి సరఫరా పైపులైన్లను గుర్తించి, వెంటనే తొలగించాలని పంచాయతీ, ఆర్‌బ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.
ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేందుకు మూడంచెల విధానంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీలు సొంతంగా నిధులు సమకూర్చుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి గ్రామాలే వెన్నెముక అని, అధికార వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజలకు చేరువ చేయడమే పంచాయతీరాజ్ శాఖ ప్రధాన ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, పెద్దాపురం డీఎల్‌పీఓ బాలామణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆస్తుల కొనుగోలులో
ఈసీ పరిశీలన కీలకం
సామర్లకోట: ఆస్తులు కొనుగోలు చేస్తున్న సమయంలో ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ల (ఈసీ) పరిశీలన ఎంతో ముఖ్యమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డిప్యూటీ ఇన్‌స్పెక్టరు జనరల్ (డీఐజీ) సీహెచ్ జానకీదేవి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సామర్లకోట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఈసీని పరిశీలిస్తే ఆ ఆస్తిపై అప్పులున్నాయా, ఇంతకు ముందు ఎవరికై నా విక్రయించారా, రిజిస్ట్రేషన్ అయిందా, లేదా అనే విషయాలు తెలుసుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఐజీఆర్‌ఎస్ వెబ్‌సైట్ ద్వారా కూడా ఈసీలు పరిశీలించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సబ్ రిజిస్ట్రార్ బీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వనదుర్గమ్మకు
యథావిధిగా హోమాలు
అన్నవరం: సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణోత్సవాల సందర్భంగా ఈ నెల 26 నుంచి మే రెండో తేదీ వరకూ అన్నవరం దేవస్థానంలో పలు ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నారు. గత ఏడాది స్వామి వారి కల్యాణోత్సవాల సమయంలో వనదుర్గ అమ్మవారికి చండీ, ప్రత్యంగిర హోమాలను నిలిపివేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అవి యథావిధిగా జరుగుతాయని అధికారులు తెలిపారు. సత్యదేవుని కల్యాణోత్సవాల సమయంలో ఈ హోమాలను నిలిపివేయడంపై ‘సాక్షి’ గత ఏడాది మే 8న ‘రత్నగిరి వనదుర్గకు అపచారమా?’ శీర్షికన, మే 13న ‘ప్రత్యంగిర హోమానికి బ్రేక్’ శీర్షికన కథనాలు ప్రచురించింది. ఈ హోమాలు నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని ఈ ఏడాది యథాతథంగా కొనసాగించనున్నారు. వీటితో పాటు శుక్రవారం ఉదయం జరిగే ఖడ్గమాల పూజ కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.


