ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం | - | Sakshi
Sakshi News home page

ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి (ట్రస్ట్‌ బోర్డు) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసింది. రత్నగిరి రామాలయం వద్ద ఉన్న విశ్రాంతి మండపంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. చైర్మన్‌గా ఐవీ రోహిత్‌, సభ్యులుగా పర్వత సూర్యారావు (సురేష్‌), సూర్య భాస్కరం ధనేకుల, కామర్స్‌ చిరంజీవిరావు, రావిపాటి సత్యనారాయణ, పాలచర్ల నాగేంద్రబాబు, తూము అప్పారావు, హెచ్‌.రామాంజనేయులు, తేలుకుంట్ల అనంతమ్మ, గెడ్డం అప్పారావు (బుజ్జి), గొడేటి భగవత్‌, రెడ్డి ఎరుకమ్మ, ఇండుగబిల్లి లోవకుమారి. యరగాటపు బాబ్జీ, బండి లక్ష్మి, తోలేటి శిరీష, తుల్లిమల్లి ఝాన్సీలక్ష్మితో ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వేములపల్లి కాంతారావు, గంగి గోవిందరాజు, ఇమ్మిడిశెట్టి వెంకట రమణ, బి.సురేంద్రనాథ్‌రెడ్డి హాజరయ్యారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో వేదిక వద్ద గందరగోళం ఏర్పడింది. తొలుత ఒక్కొక్క సభ్యునితో విడివిడిగా ప్రమాణ స్వీకారం చేయించాలనుకున్నారు. పరిస్థితి చూసి, సభ్యులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు.

అన్నదానంలో భక్తులకు సత్యదేవుని ప్రసాదం

ట్రస్ట్‌ బోర్డు తొలి సమావేశంలో తీర్మానం

సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భక్తులో భోజనంతో పాటు స్వామివారి ప్రసాదం కూడా అందించాలని నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో తీర్మానించారు. చైర్మన్‌ రోహిత్‌ అధ్యక్షతన మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఈ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ అంశంపై ‘అమాత్యా.. మొరాలకించవా..!’ శీర్షికన ఈ నెల 12న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అదే రోజు అన్నవరం వచ్చిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ కథనంపై స్పందించి, అన్నదానంలో సత్యదేవుని ప్రసాదం కూడా భక్తులకు పెట్టాలని ఆదేశించారు. ఈ మేరకు నూతన ట్రస్ట్‌ బోర్డు తొలి సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించి, వెంటనే అమలు చేయాలని నిర్ణయించారు. సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement