భద్రతా వైఫల్యానికి యువకుడి బలి
పిఠాపురం: అధికారుల భద్రతా వైఫల్యం ఓ అమాయకుడిని బలి తీసుకుంది. చేబ్రోలు జరిన రాములవారి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం కిందపడి శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన దుక్కా వెంకటేష్ (22) మృత్యువాత పడిన సంఘటన భక్తులను కలవరపాటుకు గురి చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి చేబ్రోలులో రాములవారి రథోత్సవం నిర్వహిస్తుండగా, చూడడానికి కత్తిపూడికి చెందిన యువకుడు దుక్కా వెంకటేష్ (శ్రీను) వచ్చాడు. రథం తాడు లాగే క్రమంలో ప్రమాదవశాత్తూ రథం తగిలి కింద పడ్డాడు. అతని పొట్ట మీదుగా రథం చక్రం నొక్కింది. వెంటనే అతనిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు మృతుడి తండ్రి దుక్క శ్రీను చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు.
ఏర్పాట్లలో విఫలం
దేవాలయ చరిత్రలో వందల ఏళ్ల నుంచి శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో ఇప్పటి వరకూ చిన్న సంఘటనలు తప్ప ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ప్రస్తుత రథోత్సవంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. రథం చక్రాల వద్ద కేవలం రథాన్ని మలుపు తిప్పే శీలలతో ఉన్న వ్యక్తులు, పోలీసులు మాత్రమే ఉండాలి. అయితే జనాన్ని అదుపు చేయడంలో ఆలయ కమిటీ విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నారు. అత్యంత భారీ జన సందోహం మధ్య సాగే రథయాత్ర జరిగే చేబ్రోలు మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ క్రమబద్దీకరించకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు.
ఆలయ కమిటీపై ఫిర్యాదు
ఆలయ కమిటీ నిర్లక్ష్యం వల్ల రథోత్సవంలో తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తండ్రి దుక్కా శ్రీను గొల్లప్రోలు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. భద్రతా చర్యలు తీసుకోవడంలో ఆలయ కమిటీ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఆలయ కమిటీపై తగిన చర్యలు తీసుకుని, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు.


