బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా నూతన కలెక్టర్‌గా ఎంఎన్ హరేందిర ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్ గా, పశ్చిమ గోదావరి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా, కడప జాయింట్ కలెక్టర్‌గా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా పని చేశారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న ఆయనను ప్రభుత్వం కాకినాడ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ షణ్మోహన్ సగిలి అమరావతి ఆర్థిక మండలి సీఈఓగా బదిలీ అయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం 2024 జూన్‌లో జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఆయన ప్రస్తుతం బదిలీపై వెళ్తున్నారు.
నేత్రపర్వం..
శృంగార వల్లభుని కల్యాణం
సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగార వల్లభ స్వామి వారి కల్యాణోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన ఇక్కడ స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. ఆలయంలో సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై రాత్రి 10 గంటలకు అర్చకులు కల్యాణ క్రతువుకు శ్రీకారం చుట్టారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మహాసంకల్పం, సుముహూర్తం, మాంగల్యసూత్ర ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో జరిగిన స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించి పులకించిపోయారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ చైర్‌పర్సన్ మొయిళ్ల సంధ్యా కృష్ణమూర్తి, ఈఓ వడ్డీ శ్రీనివాసరావుల ఆధ్వర్యాన కల్యాణానికి ఏర్పాట్లు చేశారు.


