ఇక ఆషామాషీ కాదు | - | Sakshi
Sakshi News home page

ఇక ఆషామాషీ కాదు

Mar 30 2026 8:42 AM | Updated on Mar 30 2026 8:42 AM

అంపశయ్యపై ఆరోగ్యశ్రీ

రూ.100 కోట్ల బకాయి పెట్టిన ప్రభుత్వం

వెంటనే చెల్లించాలని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల డిమాండ్‌

ఏప్రిల్‌ 1 నుంచి

ఎన్‌టీఆర్‌ వైద్య సేవల నిలిపివేత

కాకినాడ క్రైం: పేదల అపర సంజీవనిగా ఖ్యాతికెక్కిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు సర్కారు అంపశయ్య మీదకు చేరుస్తోంది. ఈ పథకం పేరును డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ వైద్య సేవగా మార్చిన ప్రభుత్వం.. అందుకు తగిన రీతిలో నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తోంది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.వేల కోట్ల బకాయిలు చెల్లించడం లేదు. ఫలితంగా చంద్రబాబు అధికారం చేపట్టిన దాదాపు రెండేళ్ల వ్యవధిలో ఈ పథకం సేవలు రెండుసార్లు పూర్తి స్థాయిలో సేవలు నిలిచిపోయిన పరిస్థితులు తలెత్తాయి. బకాయిలపై ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ (ఆషా) ప్రతినిధులు పదులసార్లు సంప్రదింపులు జరిపినా ఫలితం లేదు. ఈ విషయం తేల్చకుండానే ఎన్‌టీఆర్‌ వైద్యసేవకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ విషయాన్ని ఇక ఆషామాషీగా తీసుకోరాదనే నిర్ణయానికి వచ్చాయి.

హామీలు తుంగలో తొక్కిన ప్రభుత్వం

ఎన్‌టీఆర్‌ వైద్యసేవ పరిధిలో జిల్లావ్యాప్తంగా 36 ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులున్నాయి. వీటితో పాటు మరో 9 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సేవలు కొనసాగుతున్నాయి. ఎన్‌టీఆర్‌ వైద్యసేవ కింద ఇప్పటి వరకూ అందించిన చికిత్సలకు గాను ఈ 36 ఆసుపత్రులకే ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అయితే ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయిలున్నాయి. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల వేళ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలను సైతం కూటమి నేతలు రకరకాల హామీలతో మభ్యపెట్టారు. బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని చెప్పారు. కానీ, అధికారం చేపట్టాక ఆ హామీని తుంగలో తొక్కడంతో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు అనేకసార్లు విజ్ఞప్తులు చేశాయి. ఫలితం లేకపోవడంతో ఎన్‌టీఆర్‌ వైద్య సేవలను రెండుసార్లు నిలిపివేశారు. దీంతో, వారిని బుజ్జగించేందుకు గత ఏడాది డిసెంబర్‌ నాటికే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ అంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. కానీ, షరా మామూలుగానే డిసెంబర్‌ వచ్చినా పట్టించుకోలేదు. ఆ గడువు దాటి మూడు నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇక గత్యంతరం లేక ఎన్‌టీఆర్‌ వైద్యసేవలను ఏప్రిల్‌ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి.

ధరల పెంపుదలేదీ?

ఎన్‌టీఆర్‌ వైద్య సేవ పరిధిలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రులు కనీస ప్రమాణాలు పాటించాలి. దీనికిగాను ప్రతి ఆసుపత్రికీ ఏటా రూ.లక్షల వ్యయం అవుతుంది. ఏటా అన్ని ధరలూ పెరుగుతున్నా ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ వైద్య సేవ చికిత్సల చార్జీలను పెంచడం లేదు. 2017లో నిర్ణయించిన ధరలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ధరలు పెంచాలని కూడా నెట్‌వర్క్‌ ఆసుపత్రులు కోరుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఇకపై యూహెచ్‌సీ

నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనల నుంచి ఊపిరి పోసుకున్న పథకం ఆరోగ్యశ్రీ. దీనిని ఆయన తనయుడు, గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరింత విస్తృతం చేశారు. చికిత్సల సంఖ్యను 938 నుంచి ఏకంగా 3,275కు పెంచారు. చికిత్స పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. వైఎస్సార్‌కు, వైఎస్‌ జగన్‌కు ఎంతో పేరు తెచ్చిన ఈ పథకానికి ఉరి బిగించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్‌టీఆర్‌ వైద్య సేవ స్థానంలో యూనివర్సల్‌ హెల్త్‌ కవరేజ్‌ (యూహెచ్‌సీ) పేరిట ఆరోగ్య బీమా పథకం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఒక ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రూ.2.5 లక్షల కంటే అధిక ఖర్చయ్యే చికిత్సలను ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ట్రస్టు నిర్వహించనుంది. అంతకంటే తక్కువ చికిత్సలన్నీ యూహెచ్‌సీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్‌టీఆర్‌ వైద్య సేవ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ముందు తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

ప్రమాదంలో పేదల ఆరోగ్యం

ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదల ఆరోగ్యం ఇక ప్రమాదంలో పడనుంది. ప్రాణ రక్షణ కోసం చేసే కీలకమైన శస్త్రచికిత్సల నిర్వహణ ప్రశ్నార్థకం కానుంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా అక్కడ పెద్ద శస్త్రచికిత్సలకు అవసరమైన ఏర్పాట్లు లేని పరిస్థితి. కాకినాడ జీజీహెచ్‌లో కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ వంటి అనేక కీలక వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవు. దీంతో, ఇప్పటి వరకూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా జరిగిన ఈ శస్త్రచికిత్సలకు ఇక నుంచి పేదలు రూ.లక్షల్లో చెల్లించాల్సిన పరిస్థితి ఎదురు కానుంది.

ప్రభుత్వ వైఖరితో ప్రజలకు నష్టం

బకాయిలు చెల్లించకుండా మాకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. రూ.3 వేల కోట్లంటే మాటలా. ఇదంతా మా చేతి డబ్బు. కొందరైతే అప్పులు చేసి మరీ నిర్వహిస్తున్నారు. పదేళ్ల నుంచి వైద్య ఖర్చులు పెంచలేదు. నిర్వహణ భారం నానాటికీ అధికమవుతోంది. డిసెంబర్‌ నాటికే వన్‌ టైం సెటిల్‌మెంట్‌ అన్నారు. ఆ గడువు పూర్తయ్యి మూడు నెలలైంది. కేవలం ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే ఇన్నాళ్లూ సేవల నిలుపుదల నిర్ణయం తీసుకోలేదు. గత్యంతరం లేకే ఇప్పుడు సేవల నిలుపుదలకు పిలుపునిచ్చాం. కీలక వైద్య సేవలు నిలిచిపోతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తే తదనంతర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

– కె.విజయ్‌కుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement