● వాడపల్లి క్షేత్రంలో
వైభవంగా శ్రీవారి కల్యాణం
● గోవింద ఘోషతో
మార్మోగిన పుర వీధులు
● కోలాహలంగా రథోత్సవం
కొత్తపేట/ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో కొలువైన శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం, రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచీ తరలి వచ్చిన భక్తులతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల గోవింద ఘోషతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన ఆలయ పాలక మండలి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచీ ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వేదపండితులు, అర్చకులు వివిధ పూజలు, హోమం, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాది భక్త జనసందోహం నడుమ మాడ వీధుల్లో స్వామివారు ముందుకు సాగిపోయారు.
కల్యాణం.. కన్నుల వైకుంఠం
వాడపల్లి ఆలయంలోని విశాల ప్రదేశంలో పంచ ద్రవ్యాలు, సుగంధ పరిమళాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహలను పుష్పాలంకృతమైన పల్లకిలో ఉంచి, వేద మంత్రాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేదిక వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ కల్యాణ మూర్తులను ఆశీనులను చేశారు. కల్యాణ తిలకంతో స్వామివారు, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతూ ఉభయ దేవేరులు భక్తజనానికి దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నడిపూడికి చెందిన వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వేద పండితులు, అర్చకుల వేద మంత్రాల ఘోష నడుమ సాయంత్రం 6.15 గంటలకు కల్యాణాన్ని వైభవంగా ప్రారంభించారు. దేవస్థానం తరఫున శ్రీవారికి ఈఓ సూర్యచక్రధరరావు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితర ప్రముఖులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ బందోబస్తు నిర్వహించారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక, వాయిద్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భక్తుల కోలాహలం
నడుమ సాగుతున్న
రథోత్సవం


