నెహ్రూ నగర్ వాసుల ఆందోళన
తుని రూరల్: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు చేసేందుకు కట్రాళ్ల కొండపై చేపడుతున్న బాంబు పేలుళ్లతో తమ ఇళ్లు ధ్వంసమవుతున్నాయని తుని ఒకటో వార్డు నెహ్రూ నగర్ వాసులు ఆందోళన చేపట్టారు. కట్రాళ్ల కొండ వద్ద ఆదివారం టెంట్ వేసి, ఆందోళనకు దిగారు. కొన్నాళ్లుగా చేపడుతున్న భారీ బాంబు పేలుళ్లతో తమ ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, సీలింగులు ధ్వంసమవుతున్నాయని, పునాదులు దెబ్బ తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాలుగైదుసార్లు రెవెన్యూ అధికారులకు, కాంట్రాక్టు సిబ్బందికి ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు చేసినప్పుడు నాలుగైదు రోజులు బాంబుల తీవ్రత తగ్గుతోందని, తర్వాత మళ్లీ భారీ బాంబుల మోత మోగుతోందని చెప్పారు. కలెక్టర్, ఆర్డీఓ తదితర అధికారులు వచ్చినా తమకు న్యాయం జరగలేదన్నారు. పోలవరం కాలువ పనులు పూర్తవుతున్నా తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. అధికారులు స్పందించి ధ్వంసమైన ఇళ్లను పరిశీలించాలని, న్యాయపరంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ఆందోళన చేస్తామని బాధితులు హెచ్చరించారు.
రేపటితో ముగుస్తున్న
దరఖాస్తుల గడువు
తుని రూరల్: హంసవరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ మోడల్ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియనుంది. ప్రిన్సిపాల్ టీవీ శివలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్ 12న జరిగే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు ఆదివారం వేలాదిగా భక్తులు లోవ దేవస్థానానికి తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,62,135, పూజా టికెట్లకు రూ.1,98,740, కేశఖండన శాలకు రూ.13,640, వాహన పూజలకు రూ.10,130, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.54,360, విరాళాలు రూ.40,315 కలిపి మొత్తం రూ.4,79,320 ఆదాయం సమకూరిందని వివరించారు.
ఘనంగా వేద సదస్యం
అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకులు సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజయిన ఆదివారం వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో సాయంత్రం 4 గంటలకు నవ దంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని మరో ఆసనం మీద వేంచేయించి, పండితులు పూజలు చేసి, వేదాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు సీతారాముల ముందు నాలుగు వేదాలను పఠించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, వడపప్పు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, గంగాధరభట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు సుధీర్, రామాలయ అర్చకుడు కోట వంశీ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏఈఓ కృష్ణారావు పర్యవేక్షించారు.


