ప్రజల ఆస్తిని వర్మకు ధారాదత్తం చేస్తారా? | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆస్తిని వర్మకు ధారాదత్తం చేస్తారా?

Mar 30 2026 8:42 AM | Updated on Mar 30 2026 8:42 AM

రూ.కోట్ల విలువైన భూమిని కట్టబెడతారా?

జీఓ–17 తక్షణం రద్దు చేయాలి

సీపీఎం నేతల డిమాండ్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ అసంతృప్తిని చల్లార్చేందుకు కాకినాడ నగరంలోని రూ.కోట్ల విలువైన ప్రజల ఆస్తిని కట్టబెట్టడం బాధాకరమని సీపీఎం నాయకులు అన్నారు. నగరంలోని చీడీలపొర గర్‌ల్స్‌ పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించిన ప్రాంతంలో వారు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ, జనసేన నాయకుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం వల్ల వర్మ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. దీనిని చల్లార్చడానికి వర్మకు చెందిన ఎస్‌వీఎస్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు విలువైన భూమిని ధారాదత్తం చేయడం బాధాకరమని అన్నారు. ఈ మేరకు జీఓ నంబర్‌ 17 ఇచ్చారన్నారు. ఈ జీఓను తక్షణమే రద్దు చేయకపోతే సీపీఎం ఆధ్వర్యాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీపీఎం నగర కన్వీనర్‌ పలివెల వీరబాబు మాట్లాడుతూ, కాకినాడలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించడం అభినందనీయమన్నారు. దీని పక్కనే ఆయుర్వేద కళాశాల కూడా ఉండాలని, కానీ, ఇది పిఠాపురంలో మంజూరైందంటూ పక్కదోవ పట్టించడం సరికాదని అన్నారు. నిర్మాణం పూర్తయిన ఆయుర్వేద ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి, దీనికి అనుబంధంగా ఆయుర్వేద కళాశాల కూడా నిర్మించాలని డిమాండ్‌ చేశారు. పర్యాటకాభివృద్ధి పేరుతో గత టీడీపీ పాలనలో ఎన్‌టీఆర్‌ బీచ్‌ పార్క్‌, రిసార్ట్స్‌, అతిథి గృహం నిర్మించారన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిర్మాణాలు శిథిలావస్థకు వస్తున్నాయన్నారు. పర్యాటకాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే బీచ్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని హితవు పలికారు. గత వైఎస్సార్‌ సీపీ పాలనలో భూముల ధారాదత్తంపై విమర్శలు చేసిన అధికార పార్టీ పెద్దలు ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మలక వెంకట రమణ, దుంపల ప్రసాద్‌, కె.నాగజ్యోతి, మేడిశెట్టి వెంకట రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement