ఈ ఉల్లి మరీ ఘాటు! | - | Sakshi
Sakshi News home page

ఈ ఉల్లి మరీ ఘాటు!

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

బయట మార్కెట్లో కేజీ రూ.18లోపే

రైతుబజార్లో రూ.23!

పట్టించుకోని

మార్కెటింగ్‌ శాఖ అధికారులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రైతుబజార్‌లో తక్కువ రేటుకు ఉల్లిపాయలు దొరుకుతాయని వస్తున్న వినియోగదారులు అక్కడ రేట్లు చూసి భయపడుతున్నారు. బయట మార్కెట్లో కేజీ ఉల్లిపాయలను రూ.15 నుంచి రూ.18లోపు విక్రయిస్తుండగా రైతుబజార్లో రూ.23కు విక్రయిస్తున్నారు. వీధి వెంబడి తిరిగే వ్యాపారులు ఆరు కేజీల ఉల్లి రూ.100కు విక్రయిస్తున్నారు. రైతుబజార్లో ఆరు కేజీలు రూ.138కు విక్రయిస్తున్నారు. ఇలా వినియోగదారుల వద్ద నుంచి రూ.38 తక్కువ కాకుండా అధికంగా లాగేసుకొంటున్నారు. కేజీ ఉల్లిపాయలు కొనుగోలు చేసుకొన్న సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి రూ.3 అదనంగా తీసుకొంటున్నారు. దీంతో రైతుబజారుకు వచ్చే వినియోగదారుల జేబులకు కన్నం పడుతోంది. ఇంటిలో ఏ కూర వండుకున్నా ఉల్లిపాయల వినియోగం సాధారణం కాబట్టి వారానికి సరిపడా సుమారు 5 కేజీలకు పై పడే ప్రతి వినియోగదారు కొనుగోలు చేస్తారు.

రోజూ 10,000 కిలోల విక్రయం

జిల్లాలోని మూడు రైతుబజార్లు ఉన్నాయి. పెద్దాపురం, కాకినాడ గాంధీనగర్‌, కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ఈ రైతు బజారులు ఉన్నాయి. ఒక్క కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌ రైతుబజార్‌లో రోజూ 7,000 కేజీల ఉల్లిపాయలు విక్రయిస్తారు. ఇక పెద్దాపురం, గాంధీనగర్‌ రైతుబజార్‌లో సుమారు 3,000 కేజీలు పైబడి ఉల్లిపాయలు విక్రయిస్తుంటారు. బయట మార్కెట్‌లో రోజురోజుకీ ఉల్లిపాయల రేటు తగ్గుతున్నా రైతుబజార్‌లో మాత్రం తగ్గించడం లేదు. రెండు మూడు నెలలుగా ఇదేవిధంగా వినియోగదారుల నుంచి అధికంగానే వసూలు చేస్తున్నారు.

చూసీచూడనట్టు..

రెండు, మూడు నెలలుగా ఉల్లిపాయలు రేట్లు తగ్గాయే తప్ప పెరగలేదని హోల్‌సేల్‌ వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈ నెల 23న సైతం రైతుబజార్‌లో కేజీ రూ.24కు విక్రయించారు. వారం పదిరోజుల నుంచి ఇదే రేటుకు ఉల్లిపాయలు రైతుబజార్‌లో విక్రయిస్తున్నారు. మంగళవారం రూ.23 రేటును రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారులు నిర్ణయించారు. కానీ పెద్ద సైజు ఉల్లిపాయలు సైతం హోల్‌సేల్‌ వ్యాపారస్తుల వద్ద తక్కువ రేటు కు కొనుగోలు చేసి కేజీ రూ.20కి విక్రయించడం కాకినాడలోఅనేక ప్రాంతాల్లో కనిపించింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో పెద్ద సైజు ఉల్లిపాయలు రూ.14 నుంచి రూ.16కు మాత్రమే విక్రయిస్తున్నారు. రైతు బజార్లో అక్కడ అధికారులు రేట్లు ఎక్కువగా విక్రయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని హోల్‌ సేల్‌ వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. అయినప్పటికీ జిల్లా అధికారులు ఈ విషయంపై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.

బయట మార్కెట్‌లో విక్రయిస్తున్న

పెద్ద సైజు ఉల్లిపాయలు

ఐదు కేజీల పెద్ద ఉల్లిపాయలను రూ.వందకు విక్రయిస్తున్న వ్యాపారి

వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు!

వాస్తవంగా కూరగాయలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వంటివి బయట మార్కెట్‌ కంటే రూ.3 నుంచి రూ.5 తక్కువకు రైతుబజార్లో విక్రయిస్తారు. ఉల్లి రేటు దిగివచ్చినా రైతుబజార్‌ అధికారులు వ్యాపారులతో కుమ్మకై ్క అధిక రేట్లు నిర్ణయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌ లో ఒక హోల్‌సేల్‌ ఉల్లి వ్యాపారి ఉన్నాడని, అతని దగ్గర స్టాక్‌ ఉంటే రేటు ఎక్కువగా పెడుతున్నారని అతని వద్ద స్టాక్‌ తక్కువగా ఉన్నప్పుడు కేజీకి రూ.రెండు మూడు రూపాయలు తగ్గించి పెడుతున్నారని రైతు బజార్లో ఉల్లిపాయలు విక్రయించే వ్యాపారులు సైతం గగ్గోలు పెడుతున్నారు. ప్రతిరోజూ రైతులు విక్రయించే కూరగాయలతో సహా రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారులు హోల్‌సేల్‌ వ్యాపారులతో మాట్లాడి రేట్లు నిర్ణయిస్తారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇద్దరు ఎస్టేట్‌ అధికారులు, గాంధీనగర్‌ రైతుబజార్‌లో ఒక ఎస్టేట్‌ అధికారి ఉన్నారు. వారానికి ఐదు రోజులు ఆర్టీసీ కాంప్లెక్స్‌ రైతు బజార్‌ ఎస్టేట్‌ అధికారులు, రెండు రోజులు గాంధీనగర్‌ ఎస్టేట్‌ అధికారి ఈ కూరగాయల ధరలు నిర్ణయిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఎస్టేట్‌ అధికారులు అక్కడ వ్యాపారి చెప్పినట్లుగా ఉల్లిపాయల రేట్లు నిర్ణయించడం కారణంగానే తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రైతుబజార్‌ సమీపంలోనే కొందరు వ్యాపారులు ఆటోలతో తక్కువ రేట్లకు ఉల్లిపాయలు విక్రయిస్తున్నా ఇక్కడ రేట్లు మాత్రం తగ్గించడం లేదు. కొందరు వినియోగదారులు ఈ విషయాన్ని ఎస్టేట్‌ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లిన వారు పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

బయట పెద్ద సైజు ఉల్లిపాయలు తక్కువకు

బయట మార్కెట్లో విక్రయిస్తున్న పెద్ద సైజు ఉల్లిపాయల సైతం ఐదు నుంచి ఆరు కేజీలు రూ.100కు విక్రయిస్తుండగా రైతుబజార్లో ఇదే సైజు ఉల్లిపాయలు కేజీ 23 రూపాయలకు విక్రయిస్తున్నారు. కేవలం చిన్న సైజు ఉల్లిపాయలు మాత్రమే కేజీ రూ.18కు రైతుబజార్లో విక్రయిస్తున్నారు. అదే చిన్నసైజు ఉల్లిపాయలు బయట వ్యాపారస్తులు కేజీ రూ.13 నుంచి రూ.15కు విక్రయిస్తున్నారు.

ధర తగ్గించాలి

కూరగాయలు తక్కువ రేట్లకు దొరకడంతోపాటు నాణ్యమైన ఉంటాయని దూర ప్రాంతాల నుంచి సైతం రైతు బజార్‌కు వస్తున్నాం. కానీ కొన్నిరోజులుగా ఉల్లిపాయల రేటు మాత్రం బయట మార్కెట్‌ కంటే కేజీ రూ.3 నుంచి రూ.4 అధికంగానే ఉంటోంది. ఇక్కడ వ్యాపారులు అడిగితే బయట అమ్మే ఉల్లిపాయలు నాసిరకమని చెబుతున్నారు. నిజానికి బయట విక్రయించే ఉల్లిపాయలు పెద్దగా ఉంటున్నాయి. నాణ్యత కూడా బాగుంటోంది.

– బొద్దపాటి వెంకట గౌతమి, కాకినాడ

హోల్‌సేల్‌ కన్నా రూ.2 అధికం

హోల్‌సేల్‌ ధరల కన్నా కిలోకు రూ.2 అధికంగా పెట్టి ప్రతీ రోజు ఉల్లిపాయలు ధరలు నిర్ణయిస్తున్నాం. రైతు బజార్‌లో విక్రయించే వ్యాపారులు సైతం హోల్‌సేల్‌ వ్యాపారస్తుల వద్ద కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తుంటారు. బయట తక్కువ రేట్లకు విక్రయిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు.

– కృష్ణారావు, ఎస్టేట్‌ అధికారి, కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌ రైతుబజార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement