కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న జగ్గంపేట డ్రైవర్స్ కాలనీ ప్రజలు
కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతున్న తోట నరసింహం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవాలని చేస్తున్న కుట్రలను విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం డిమాండ్ చేశారు. జగ్గంపేట గ్రామ పరిధిలోని డ్రైవర్ కాలనీ లబ్ధిదారులు తమ స్థలాలు ఎవరికీ ఇవ్వవద్దని ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న తోట నరసింహం అనంతరం కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2010 సంవత్సరంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ప్రభుత్వం డ్రైవర్లకు, ఆశా వర్కర్లకు, సెక్స్ వర్కర్లకు, ఇతర పేదలకు సుమారు 170 ఇళ్ల స్థలాలను కేటాయించిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల, మౌలిక వసతులు లేక ఆ స్థలంలో ప్రజలు పూర్తిస్థాయిలో ఇళ్లు నిర్మించుకోలేకపోయారన్నారు. చాలామంది బేస్మెంట్ లెవల్‌కు కట్టారని, కొంతమంది ఇళ్లు పూర్తి చేసుకుని, రేకు షెడ్లు నిర్మించుకొని నివసిస్తున్నారన్నారు. లబ్ధిదారులు రూ. 5,000 చొప్పున సమీకరించి కరెంటు వేయించుకున్నారని గుర్తు చేశారు. లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి వెళుతుంటే ప్రస్తుతం రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ చేసి నిరుపేదలకు న్యాయం చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఏపీ రైతుకూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూమి రేట్లు పెరగడంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది పెత్తందారుల కళ్లు పడ్డాయన్నారు. తమ అనుచరులకు ఆ భూములను కేటాయించుకోవడానికి లబ్ధిదారులైన పేదలను భూముల నుంచి ఖాళీ చేయించే కుట్రలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే పంచాయతీ తీర్మానం చేశారని విమర్శించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా లబ్ధిదారులను తమ స్థలాల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. తక్షణమే పంచాయతీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని, పేదలను ఆ స్థలాల్లో నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై కలెక్టర్ జోక్యం చేసుకొని విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పేదల ఇళ్ల స్థలాల కాలనీలో మౌలిక వసతులు కల్పించి వారికి న్యాయం చేయాలని కోరారు. జగ్గంపేట గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ బండారు రాజా, ప్రగతి శీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి) జిల్లా నాయకులు రెడ్డి దుర్గాదేవి, ఏఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు మడికి సత్యం పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ
కో ఆర్డినేటర్ తోట నరసింహం


