ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బినామీ రుణాల కారణంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సహకార సంఘాలు అధికారులపై మండిపడ్డారు. కాకినాడలోని డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం టర్న్ ఎరౌండ్ యాక్షన్ ప్లాన్ – టీఏపీ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బినామీ వ్యవసాయ రుణాలు ఇచ్చి వాటిని వసూలు చేయడంలో జిల్లాలోని ఆరేడు సహకార సంఘాలు చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా డీసీసీబీ బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది, సహకార సంఘాల్లో పనిచేస్తున్న సుమారు రెండువేల మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఒత్తిళ్లు ఉంటే తమకు వ్యక్తిగతంగా చెప్పాలే కానీ బినామీ రుణాలు వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోనసీమ, రాజమహేంద్రవరంలలో రికవరీలు బాగా ఉన్నాయని కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం, కిర్లంపూడి, గోకవరం తోపాటు పలు బ్రాంచ్‌ల్లో బినామీ రుణాలు ఇవ్వడంతో అక్కడ రికవరీ కష్టంగా మారిందన్నారు. సహకార సంఘాలకు వెళ్లి రికార్డులు ఎందుకు తనిఖీ చేయలేదని బ్యాంకు ఇన్‌చార్జి సీఈవో ప్రవీణ్‌కుమార్‌ను ఆప్కాబ్ చైర్మన్ నిలదీశారు. తాము వెళ్లినా అక్కడి సీఈవోలు రికార్డులు చూపించడం లేదని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఏలేశ్వరం శాఖలో రెండువేల మందికి రైతులకు రుణాలు ఇవ్వగా 700 మందికి రుణాలు ఇచ్చిన ఫైల్స్ మాత్రమే ఉన్నాయన్నారు. మిగిలినవి తమకు ఇవ్వడం లేదని ఆప్కాబ్ చైర్మన్‌కు ప్రవీణ్ వివరించారు. నాబార్డు జీఎం కేవీఎస్ ప్రసాద్, అప్కాబ్ ఎండీ ఆర్.రామకృష్ణ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి
ట్రెజరీ డీడీగా పాషా
కాకినాడ లీగల్: ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి ట్రెజరీ డీడీగా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్.పాషాను నియమించారు. జిల్లా ట్రెజరీ డీడీ ఎ.గణేష్ వ్యక్తిగత కారణాల వల్ల ఏప్రిల్ 18వ తేదీ వరకు సెలవు పెట్టారు. మంగళవారం డీడీ గణేష్ బాధ్యతలు పాషాకు అప్పగించారు.
ఉత్సాహంగా ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో క్రీడాప్రాధికార సంస్ధ ఆధ్వర్యంలో మంగళవారం శాప్ లీగ్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను డీఎస్‌డీఓ వి.సతీష్ కుమార్ ప్రారంభించారు. షాట్‌పుట్, లాంగ్ జంప్, డిస్కస్‌త్రో, జావలిన్‌తో, రన్నింగ్ విభాగాల్లో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయికి జిల్లా జట్టును ఎంపిక చేశారు.
శృంగార వల్లభస్వామికి
రూ.15 లక్షల ఆదాయం
సామర్లకోట: పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శృంగారవల్లభస్వామి ఆలయానికి హుండీల లెక్కింపు ద్వారా రూ.15,10,845 ఆదాయం వచ్చిన్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 29 నుంచి స్వామి వారి కల్యాణ ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. 41 రోజులకు స్వామి హుండీ ద్వారా రూ.11,55,167, అన్నదాన హుండీ ద్వారా రూ.3,55,678 వచ్చిందన్నారు. పంచారామ క్షేత్ర ఈఓ బళ్ల నీలకంఠం, ఆలయ చైర్మన్ మొయిళ్ల సంధ్య పాల్గొన్నారు.


