అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వ్రత విభాగంలో ప్రథమ శ్రేణి వ్రత పురోహితునిగా పనిచేస్తున్న మల్లాది గురుమూర్తి భక్తుల వద్ద నుంచి కానుకలు డిమాండ్ చేశాడన్న ఆరోపణలపై క్రమశిక్షణ చర్యగా రెండు ఇంక్రిమెంట్లు కట్ చేసినట్లు ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. మంగళవారం ఆ మేరకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. ఇప్పటికే గురుమూర్తిని వ్రతకథలు చెప్పవద్దని ఆదేశించారు.
గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన అన్నవరం దేవస్థానం పురోహితులు ఆరుగురు, మరో ముగ్గురు అదనపు పురోహితులు ఏలూరు జిల్లా పాలకొల్లులో సత్యదేవుని సామూహిక వ్రతాలు నిర్వహించారు. సుమారు 500 మంది భక్తులు ఆ వ్రతాలలో పాల్గొన్నారు. వ్రతాలనంతరం పురోహితులు భక్తుల నుంచి రూ.201, రూ.501 కానుకలు ఇవ్వాలని డిమాండ్ చేశారని దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి వీడియో సహితంగా భక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ కే రామచంద్రమోహన్ ఆ పురోహితులపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆరుగురు పురోహితులను ఈఓ త్రినాథరావు సస్పెండ్ చేశారు. ఆ తరువాత అధికారులు నిర్వహించిన విచారణలో ప్రథమ శ్రేణి పురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రతకథ చెప్పి కానుకలు డిమాండ్ చేసినట్టు తేలడంతో అతడు మినహా మిగిలిన పురోహితుల సస్పెన్షన్ ఉపసంహరించారు. మూడు నెలల అనంతరం మల్లాది గురుమూర్తిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. వ్రతకథలు చెప్పవద్దని ఆదేశించారు. అయితే గురుమూర్తి గతంలో పలుమూర్లు ఇదే విధంగా కానుకలు డిమాండ్ చేసి సస్పెన్షన్‌కు గురైనట్టు తేలడంతో అతడికి భవిష్యత్తులో వచ్చే రెండు ఇంక్రిమెంట్టు కట్ చేస్తూ ఈఓ ఆదేశాలిచ్చారు.
భక్తులను కానుకలు డిమాండ్
చేసినట్టు రుజువవడంతో
వ్రత కథ చెప్పవద్దని ఆదేశం
రెండు ఇంక్రిమెంట్లు
కట్ చేస్తూ ఈఓ ఆదేశాలు


