చురుగ్గా ‘పంపా’ బ్యారేజీ కొత్త గేట్ల పనులు | - | Sakshi
Sakshi News home page

చురుగ్గా ‘పంపా’ బ్యారేజీ కొత్త గేట్ల పనులు

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

అన్నవరం: తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాలలోని సుమారు 12,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే పంపా ప్రాజెక్ట్‌ బ్యారేజీకి కొత్త గేట్లు అమర్చే పనులు చురుకుగా జరుగుతున్నాయి. బ్యారేజీ పాత ఐదు గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు పనులు ఈ నెల పదో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్యారేజీలోని ఒకటి, రెండో నంబర్‌ గేట్లు పూర్తిగా తొలగించారు. ఆ గేట్ల మీద ఉన్న ఐరన్‌ స్ట్రక్చర్‌, గేట్లు పైకి కిందకు ఎత్తే యంత్రాలు అన్నింటినీ కూడా తొలగించారు. ఈ గేట్ల ఏర్పాటు కాంట్రాక్ట్‌ పొందిన ఏజెన్సీ నిపుణులు ఇప్పటికే రెండు కొత్త గేట్లు పంపా బ్యారేజీ వద్దకు తీసుకువచ్చారు. సుమారు 25 అడుగుల పొడవు కలిగిన ట్రాలీ ద్వారా ఈ గేట్లను పంపా ప్రాజెక్ట నదీ గర్భంలోకి తీసుకువచ్చారు. వీటిని అమర్చేందుకు సుమారు వంద అడుగుల ఎత్తయిన 50 టన్నుల కెపాసిటీ గల క్రేన్‌ను తీసుకువచ్చారు. ఆ క్రేన్‌ సహకారంతో ఈ కొత్త గేట్లు అమర్చే పనులు కూడా ప్రారంభమయ్యాయి.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ

వరదలు, తుపాన్ల సమయంలో ఈ గేట్లు ఎత్తడం, దింపడం చాలా కష్టం. సుమారు రెండు దశాబ్దాలుగా ఈ బ్యారేజీ గేట్లు నిర్వహణ ఇబ్బందిగా మారడంతో మార్చాలనే డిమాండ్‌ ఉంది. పంపా ప్రాజెక్ట్‌ బ్యారేజీకి కొత్త గేట్లు అమర్చేందుకు 2023లో అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే 2024 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ కారణంగా నిధులు విడుదల కాలేదు. 2024 ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విపత్తు రక్షణ నిధుల నుంచి రూ.3.36 కోట్లను 2024 డిసెంబర్‌లో కొత్త గేట్లు ఏర్పాటుకు మంజూరు చేసింది. 2025లో ఈ గేట్లు అమర్చడానికి మూడుసార్లు టెండర్లు పిలిచారు. ఎట్టకేలకు 2025 ఏప్రిల్‌లో టెండర్లు ఖరారు చేశారు. పంపా బ్యారేజీకి కొత్త గేట్లు ఏర్పాటు ఏప్రిల్‌ 15 వ తేదీకల్లా పూర్తవుతుందని ఈఈ శేషగిరిరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement