బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరిస్తామని, ఈ ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రబీలో ధాన్యం సేకరణకు 227 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఈ రబీ సీజన్లో మొత్తం 75197 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేపట్టగా , సుమారు 6,76,774 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుందని అంచనా వేశామన్నారు. దీనిలో 67,677 మెట్రిక్ టన్నులు ధాన్యం స్థానిక వినియోగానికి పోను 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సాధారణ రకం క్వింటాకు రూ.2,369, ఏ గ్రేడ్ కు రూ.2,389 మద్దతు ధరగా ప్రకటించామన్నారు. జిల్లాలోని రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పించే చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్‌ఎస్‌ఎస్ సత్యనారాయణ రాజు, డీటీసీ ఎన్.శ్రీధర్, లీగల్ మెట్రాలజీ డీసీ జనార్ధన్, ఎఫ్‌సీఐ మేనేజర్ సీహెచ్ గంగాధర్ పాల్గొన్నారు.
2న జెడ్పీ స్థాయీ సంఘ
సమావేశాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఏప్రిల్ 2న ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తారు. వీటిని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు బుధవారం ప్రకటనలో తెలిపారు.
నేడు సత్యదేవుని
హుండీల ఆదాయం లెక్కింపు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. చివరగా హుండీ ఆదాయం ఈ నెల 16వ తేదీన లెక్కించారు. అయితే ఈ నెల 31వ తేదీ తో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున పది రోజుల వ్యవధిలోనే రెండో సారి హుండీ ఆదాయం లెక్కిస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌కు
సహకారం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆర్‌ఆర్‌ఆర్, ఫ్లడ్ మేనేజ్‌మెంట్ పనులకు సహకరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన ఆయనను రాజమహేంద్రవరంలోని ఒక హాటల్‌లో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ప్రాజెక్టు పెండింగ్ డిజైన్లకు అనుమతులు వచ్చేలా సహకరించాలని కోరారు. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి ఏటి గట్ల పటిష్టతకు సహకరించాలన్నారు. కాంతారావును కలెక్టర్ కలెక్టర్ కీర్తి మర్యాద పూర్వకంగా కలిశారు.
28న జాబ్‌మేళా
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్‌కే బుధవారం తెలిపారు. డిగ్రీ, పీజీ పాసైన, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు 30 కంపెనీలతో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అర్హత గల విద్యార్థులు ఉదయం 9 గంటలకు తమ బయోడేటా, సరిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల జేకేసీ విభాగంలో సంప్రదించవచ్చన్నారు.


