నిందితులను వదిలే ప్రసక్తి లేదు | - | Sakshi
Sakshi News home page

నిందితులను వదిలే ప్రసక్తి లేదు

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

బాధితురాలికి అండగా ఉంటాం

మానవ హక్కుల చైర్‌పర్సన్‌ శైలజ

తుని: మానవ సమాజం తలదించుకునే విధంగా గిరిజన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం తునిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన దివ్యాంగురాలిని శైలజ పరామర్శించారు. లైంగికదాడిలో గాయపడిన దివ్యాంగురాలి ఆరోగ్య పరిస్థితిని న్యూరో వైద్యుడు గురుప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. అనంతరం మీడియా సమావేశంలో శైలజ మాట్లాడుతూ ఈ నెల 18న కోటనందూరు మండలం పాత కొట్టాం పంచాయతీ పరిధిలోని సంగవాకలో గిరిజన దివ్యాంగురాలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడిచేసి, ఆపై హత్యాయత్నం చేశారన్నారు. తలకు బలమైన గాయం కావడంతో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని, ఒక వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడి ఉండటం అసాధ్యమన్నారు. పోలీస్‌శాఖ లోతుగా విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకోవాలని సూచించారు. గిరిజన దివ్యాంగురాలిపై అఘాత్యానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement