బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విజ్ఞాన భాండాగారాలుగా పేర్కొనే గ్రంథాలయాలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరంలో ఉంటున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన కొత్త పుస్తకాలను అందించలేకపోతున్నాయి. డిజిటల్ గ్రంథాలయాలుగా సాంకేతికతను అందిపుచ్చుకోలేని దుస్థితి కొనసాగుతోంది. ప్రజలు చెల్లించే ఆస్తి పన్ను నుంచి గ్రంథాలయ సెస్సును చెల్లించకపోవడమే ఇందుకు కారణం. దీనికితోడు ప్రభుత్వం నుంచి నిధులు సైతం సక్రమంగా మంజూరుకాకపోవడం గమనార్హం.
పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాలు ఉంటున్నాయి. రాష్ట్రంలోనే జిల్లా కేంద్రంలో తొలి డిజిటల్ గ్రంథాలయం ఏర్పడిందని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడా సాంకేతిక పరిజ్ఞానమనేదే కనపడదు. నిధుల కొరత కారణంగా ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని స్థితి నెలకొంది.
బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం
గ్రంథాలయాల అభివృద్ధి అంశంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలకు రూ.130 కోట్లు అవసరం కాగా 2025–26 బడ్జెట్లో కేవలం రూ.40 కోట్లు మాత్రమే విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం. నెలల తరబడి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే.. సెస్సు వసూలు చేసుకుని తీసుకోండంటూ ఉచిత సలహా ఇచ్చి చేతులు ఎత్తేసింది. దీంతో సెస్సు బకాయిలు వసూలు కాక, ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ సరిపోక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అసంతృప్తిలో ఉద్యోగులు
ఉమ్మడి తూర్పు జిల్లా పరిధిలో కేంద్ర గ్రంథాలయంతో కలిపి 102 గ్రంథాలయాలు ఉండగా, వీటిల్లో గ్రేడ్ –1లో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం, రామచంద్రపురం, తుని ప్రాంతాలు ఉండగా గ్రేడ్ –2లో 11, గ్రేడ్ –3లో 80 కేంద్రాలు ఉన్నాయి. ఇవి కాక మరో 161 బీసీడీలు (పుస్తక నిక్షిప్త కేంద్రాలు) ఉన్నాయి. వీటన్నింటిలో 204 రెగ్యులర్ ఉద్యోగులకుగాను 55మంది పనిచేస్తుండగా మిగిలినని ఖాళీగా ఉన్నాయి. 64మంది ఔట్‌సోర్సింగ్ విధానంలో వివిధ క్యాడర్‌లలో పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 175 మంది పెన్షన్‌దారులు ఉండగా వీరికి ప్రతి నెలా దాదాపు రూ.40లక్షలు అవసరం అవుతుంది. జీతాలతో పాటు కంటెంజెంట్, పేపర్, ఎలక్ట్రికల్, గ్రంథాలయ బిల్డింగ్‌ల అద్దె బిల్లులు తదితరాలకు కలిపి నెలకు దాదాపు రూ.కోటి వరకూ అవసరం. ఈ లెక్కన ఏడాదికి ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల అవసరాలకు రూ.12 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేంద్ర గ్రంథాలయానికి కేవలం రూ.5 కోట్లు లోపు నిధులు మాత్రమే విడుదల చేసింది. ఉద్యోగ విరమణ చేసిన వారికి కొంతకాలంగా ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కీలక పోస్టులో ఇన్‌చార్జి
కీలకమైన గ్రంథాలయ సెక్రటరీ పోస్టు ఇన్‌చార్జితో నెట్టుకొస్తున్నారు. ఇప్పటి వరకూ పనిచేసిన ఉద్యోగి పదవీ విరమణ చేయడంతో విశాఖ జిల్లా అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు.
ఆస్తి పన్నులో 8 శాతం
పంచాయతీలు, నగర, పురపాలికల్లో ఏటా వసూలు చేసే ఆస్తి పన్నులోనే 8 శాతం గ్రంథాలయ సెస్సు విధిగా ఉంటుంది. వీటిని జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకు జిల్లా పంచాయతీ శాఖ, నగర, పురపాలికలు జమ చేయాల్సి ఉంది. ఈ సెస్సు నిధులతోనే గ్రంథాలయాల్లో అభివద్ధి పనులు, మరమ్మతులు, అవసరమైన మేరకు శాశ్వత భవనాలు, గదుల నిర్మాణం చేపడుతుంటారు. దిన, వార, మాస పత్రికలు, కుర్చీలు, టేబుళ్లు, అట్టలు, పార్ట్ టైం ఉద్యోగుల జీతాలు, విద్యుత్తు బిల్లులూ చెల్లిస్తుంటారు. అయితే సెస్సు చెల్లింపుల్లో ఆయా సంస్థలు నిర్లక్ష్యం వహిస్తుండడంతో గ్రంథాలయాలకు నిధుల కొరత ఏర్పడుతోంది.
సెస్సు బకాయిలు రూ.43 కోట్లు
జిల్లా గ్రంథాలయ సంస్థలకు సెస్ బకాయి రూ.43 కోట్ల వరకూ ఉంది. కాకినాడ కార్పొరేషన్ రూ.8.5 కోట్లు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ రూ.18 కోట్లు బకాయి ఉండగా పంచాయతీల నుంచి రూ.16.5 కోట్లు వసూలు కావలసి ఉంది.
నెలనెలా జీతాలందక అల్లాడిపోతున్న గ్రంథాలయ ఉద్యోగులు
ఏడాదికి రూ.12 కోట్లు అవసరం కాగా
రూ.5 కోట్లు కూడా ఇవ్వని సర్కారు
సెస్ వసూలు చేసి సర్దుబాటు
చేసుకోమంటున్న చంద్రబాబు ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చి రెండు, మూడు నెలలు చెల్లించి హడావుడి చేసిన చంద్రబాబు ప్రభుత్వం నేడు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. రెండు, మూడు నెలలు బకాయిలు పెడుతూ వారిని నానా అవస్థలకు గురి చేస్తోంది. గ్రంథాలయ సంస్థల్లో పనిచేసే వారి పరిస్థితి అయితే మరీ ఘోరం.


