● మరో మలుపు తిరిగిన పురోహితుని చేతివాటం వ్యవహారం
● మొత్తం రూ.58.39 లక్షల రికవరీ అయినా వివాదానికి పడని తెర
● ఆరుగురు సిబ్బంది, 18 మంది వ్రత పురోహితులపై చర్యలు
● బ్యాంకు అధికారులకు సైతం నోటీసులు
● దేవదాయ కమిషనర్ ఆదేశాలు
● ఉద్యోగులు, వ్రత పురోహితుల్లో ఆందోళన
అన్నవరం: సత్యదేవుని వ్రత విభాగంలో ఓ వ్రత పురోహితుడు చేతివాటం చూపిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ పురోహితుడు కాజేసిన మొత్తం రూ.58.39 లక్షలూ అధికారులు రికవరీ చేయడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడిందని అందరూ భావిస్తున్నారు. కానీ, అక్కడ పడింది ఫుల్‌స్టాప్ కాదని, కామాయేనని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తెలిసో.. తెలియకో చేసిన చేసిన తప్పు.. వదల బొమ్మాళీ.. అన్నట్టుగా సంబంధిత బాధ్యులను వెంటాడుతోంది. ఈ అవకతవకలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, వ్రత పురోహితులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ అధికారులకు కూడా నోటీసులివ్వాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తాజాగా ఆదేశించారు. ఈ ఆదేశాలు అన్నవరం దేవస్థానంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఏం జరిగిందంటే..
వ్రత పురోహితుల పారితోషికం బిల్లులు తదితర అంశాలను దేవస్థానంలో మరో పురోహితుడు చూసేవాడు. ఈ క్రమంలో 2024 జనవరి నుంచి 2025 నవంబర్ వరకూ 22 నెలల పాటు అతడు దశలవారీగా రూ.58.39 లక్షల మేర అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది. దీనిపై అతడిని నిలదీయడంతో గత ఏడాది డిసెంబర్‌లో రూ.28.54 లక్షలు జమ చేశాడు. ఆ తరువాత అతడు మరణించడంతో మిగిలిన మొత్తంలో ఆ పురోహితుడి భార్య నుంచి కొంత, అతడి గ్రాట్యుటీ నుంచి మిగిలినది రికవరీ చేశారు. అలాగే, ఆ పురోహితుడి ద్వారా తమ అకౌంట్లలో ఎక్కువ పారితోషికాన్ని జమ చేయించుకున్న 18 మంది వ్రత పురోహితుల నుంచి కూడా దేవస్థానం అధికారులు ఆ మొత్తాలను రికవరీ చేశారు. వ్రతాల సెక్షన్‌లోని సిబ్బందిని కూడా ఇతర సెక్షన్లకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో దేవస్థానానికి కాని, వ్రత పురోహితులకు కాని ఎటువంటి ఆర్థిక నష్టం జరగలేదని, మొత్తం అంతా రికవరీ చేశామని దేవదాయ శాఖ కమిషనర్‌కు ఈఓ గత జనవరిలో నివేదిక పంపించారు. అక్కడితో ఈ వివాదం సమసిపోయినట్టేనని అందరూ భావించారు.
కమిషనర్ ఆదేశాలివీ..
● అయితే, ఈ అవకతవకలపై కమిషనర్ రామచంద్ర మోహన్ తాజాగా ఆదేశాలు ఇచ్చారు.
● పురోహితుల పారితోషికం వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆఫీసు సిబ్బంది ఆరుగురిపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీరిలో కొంతమంది ఉద్యోగ విరమణ చేయగా, ఒకరు వచ్చే నెలలో రిటైర్ కానున్నారు. తాజా పరిణామాలతో ఆ ఉద్యోగితో పాటు మిగిలిన వారు కూడా తమపై ఏ చర్య తీసుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు.
● అలాగే, చేతివాటం చూపిన పురోహితుడు తమ అకౌంట్లకు అధిక మొత్తాలు జమ చేస్తున్నా ఆ విషయాన్ని అధికారుల దృష్టికీ తీసుకు రాకుండా అతడికి సహకరించారనే అభియోగంపై 18 మంది పురోహితులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అధికంగా పొందిన మొతాలను తిరిగి దేవస్థానానికి జమ చేసినప్పటికీ మళ్లీ క్రమశిక్షణ చర్యలంటూ కమిషనర్ ఆదేశాలివ్వడంపై ఈ 18 మంది వ్రత పురోహితుల్లో ఆందోళన మొదలైంది. దీనిపై వ్రత పురోహిత సంఘం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
● అంతే కాకుండా.. దేవస్థానం పంపించిన వ్రత పురోహితుల అధికారిక జాబితాను పరిశీలించకుండా.. కేవలం ఆ పురోహితుడు ఇచ్చిన లిస్ట్ ఆధారంగా పురోహితుల ఖాతాలకు పారితోషికాలు జమ చేసిన స్టేట్ బ్యాంక్ అధికారులకు కూడా నోటీసులివ్వాలని కమిషనర్ ఆదేశాలివ్వడం దేవస్థానంలో కలకలం రేపుతోంది.
● ప్రతి నెలా పురోహితుల పారితోషికం చెల్లించే ఫైలును, ఆ జాబితాను దేవస్థానం ఆడిట్ విభాగం తనిఖీ చేయాలి. కానీ, ఆ విభాగం సిబ్బంది ఆ పని చేయకుండా, జాబితాపై వెరిఫైడ్ అని సర్టిఫై చేస్తున్నారని, దీనిపై ఆడిట్ సిబ్బందిని సంజాయిషీ అడగాలని కమిషనర్ ఆదేశించారు.
చర్యలు తీసుకుంటాం
వ్రత పురోహితుడు చేతివాటం చూపిన రూ.58.39 లక్షలు పూర్తిగా రికవరీ చేశాం. అయితే, ఈ వ్యవహారంలో దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యం, ఆ వ్రత పురోహితునికి మిగిలిన 18 మంది పురోహితులు సహకరించారన్న అభియోగాలున్నాయి. అలాగే, స్టేట్ బ్యాంక్ అధికారులు సరిగ్గా వ్యవహరించలేదనే విమర్శలున్నాయి. వీరిపై తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. అందువలన వారికి నోటీసులిచ్చి తగు చర్యలు తీసుకుంటాం.
– వి.త్రినాథరావు,
కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం


