● సత్యదేవునికి రూ.1.23 కోట్ల
హుండీ ఆదాయం
● వివాహాల సీజన్‌తో పెరిగిన రాబడి
అన్నవరం: వివాహాల సీజన్ కావడంతో రత్నగిరిపై సిరుల వాన కురిసింది. గడచిన 21 రోజులకు గాను హుండీల ద్వారా సత్యదేవునికి రూ.1,23,68,424 ఆదాయం సమకూరింది. దేవస్థానంలో హుండీలను సోమవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ.1,14,11,009, చిల్లర నాణేలు రూ.9,57,415 లభించాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. వీటితో పాటు బంగారం ఏడు గ్రాములు, వెండి 320 గ్రాములు లభించాయని చెప్పారు. అలాగే, యూఎస్‌ఏ డాలర్లు 126, సింగపూర్ డాలర్లు 2, ఖతార్ రియల్స్ 82, కువైట్ దీనార్లు 3, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీరామ్స్ 120, సౌదీ రియల్స్ 20, ఆస్ట్రేలియా డాలర్లు 5, మలేషియా రింగిట్స్ 2, కెనడా డాలర్లు 5, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ దీనార్లు 3 వేలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ లిబియా దీనార్లు 10, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 500, నరోడ్నా బ్యాంక్ స్రర్జీ దీనార్లు 10, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ రియల్స్ 1 చొప్పున లభించాయని వివరించారు. మొత్తం 21 రోజులకు గాను హుండీల ద్వారా సగటున రోజుకు రూ.5,88,972 ఆదాయం సమకూరింది. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.
వివాహాల జోరుతో..
సుమారు మూడు నెలల మూఢమి తరువాత గత నెల 18 నుంచి వివాహాది శుభకార్యాలు ప్రారంభమయ్యాయి. దీంతో, రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో వివాహాలు జోరుగా జరుగుతున్నాయి. అలాగే, ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకుంటున్నవారు కూడా సత్యదేవుని సన్నిధికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారి హుండీల్లో దండిగా కానుకలు సమర్పిస్తున్నారు. ఫలితంగానే హుండీల ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు.
తగ్గిన బంగారు కానుకలు
ఏడాది కాలంగా బంగారం ధరకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో సత్యదేవుని హుండీల్లో భక్తులు సమర్పిస్తున్న బంగారు కానుకలు కూడా బాగా తగ్గిపోయాయి, ఈసారి హుండీల్లో బంగారం 7 గ్రాములు మాత్రమే వచ్చింది. గత నెల 5న జరిగిన హుండీల ఆదాయం లెక్కింపులో 11.5 గ్రాములు, 23న 12 గ్రాములు వచ్చింది. సత్యదేవుని హుండీల్లో భక్తులు సమర్పించే బంగారు కానుకలు మామూలుగానే తక్కువగా ఉంటాయి. అటువంటిది బంగారం ధర పెరుగుదలతో ఇది మరింతగా తగ్గింది.


