బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 28,551 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా తొలి రోజు తెలుగు పరీక్షకు 28,373 మంది హాజరయ్యారు. 178 మంది పరీక్ష రాయలేదని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 8.45 గంటల నుంచే విద్యార్థులను గేటు వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసి, ఆయా కేంద్రాల లోపలకు అనుమతించారు. బ్యాగులు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను అనుమతించలేదు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 35, డీఈఓ 5, అసిస్టెంట్ ఎగ్జామినేషన్స్ కమిషనర్ 4 కేంద్రాల్లో తనిఖీలు చేశారు. గత ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో సరైన సౌకర్యాలు లేక దివ్యాంగ విద్యార్థులు అవస్థలు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓను ముందుగానే సంప్రదించచారు. దీంతో, వారికి గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పరీక్షలు రాసే అవకాశం కల్పించారు.
ఓపెన్ స్కూల్ టెన్త్‌కు 1,538 మంది హాజరు
ఓపెన్ స్కూల్ పదో తరగతి విద్యార్థులకు సోమవారం తెలుగు పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,130 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 1,538 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. 592 మంది గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్ తెలిపారు.


