నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం | - | Sakshi
Sakshi News home page

నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం

Mar 9 2026 7:32 AM | Updated on Mar 9 2026 7:32 AM

కాకినాడలో ఓ మహిళ నిర్వాకం

కాంట్రాక్టు ఉద్యోగి చనిపోతే

భార్యకు రెగ్యులర్‌ ఉద్యోగం

కీలకంగా వ్యవహరించిన

సీనియర్‌ అసిస్టెంట్‌

కాకినాడ, ‘తూర్పు’ కలెక్టర్లు సీరియస్‌

మహిళ సస్పెన్షన్‌

అమర్‌కాంత్‌ సరెండర్‌కు ఆదేశాలు

కాకినాడ క్రైం: కారుణ్య నియామకాల కోటాలో.. నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఓ మహిళ పైన, ఆమెకు సహకరించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పైన కాకినాడ జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ తీవ్ర చర్యలు తీసుకున్నారు. వివరాలివీ..

కాకినాడకు చెందిన చెరుకూరి (పోల) హేమలత భర్త వినయ్‌ సంపత్‌ ఐదేళ్ల క్రితం కోవిడ్‌ సోకి మృతి చెందాడు. ఆయన కాకినాడలో ప్రభుత్వ కాంట్రాక్టు విధానంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేసేవాడు. భర్త చనిపోయిన కొద్ది రోజులకు హేమలత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌)ను ఆశ్రయించింది. తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరింది. అప్పట్లో డీఎంహెచ్‌వో కార్యాలయం పీఓడీటీటీ విభాగంలో పని చేస్తూ, డెప్యూటేషన్‌పై రాజమహేంద్రవరంలోని అర్బన్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్‌కు వెళ్లిన సీనియర్‌ అసిస్టెంట్‌ కేశవ అమర్‌కాంత్‌ అగస్త్యకు ఈ విషయం తెలిసింది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్న అతడు.. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం కాస్తా ద్విచక్ర వాహనాలపై కలిసి తిరిగేంత వరకూ వెళ్లింది. అర్జీదారుతో ఎందుకంత ఉన్నతాధికారులు చనువని ప్రశ్నిస్తే తన మేనకోడలని అమర్‌కాంత్‌ బదులు చెప్పేవాడు.

ఈ నేపథ్యంలో అతడు కాకినాడలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ అయ్యాడు. ఆ కళాశాలలో అప్పటికి 10 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే అదనుగా అమర్‌కాంత్‌ కారుణ్య నియామక కోటాలో హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని భావించాడు. అయితే, నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం కేవలం ప్రభుత్వ ఉద్యోగి భాగస్వామికే తప్ప కాంట్రాక్టు ఉద్యోగి భాగస్వామికి వర్తించదు. దీంతో, హేమలతకు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు అమర్‌కాంత్‌ పథకం వేశాడు.

కలెక్టర్‌కే బురిడీ...

ఆమె పేరిట నకిలీ పత్రాలు సృష్టించి, హేమలత భర్త సంపత్‌ది రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగమని ఉన్నతాధికారులను అమర్‌కాంత్‌ నమ్మించాడు. అతడిది ప్రభుత్వ నియామకమన్నట్లు, ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు అందుకున్నట్లు, ఉన్నతాధికారులకు రిపోర్టింగ్‌ చేసినట్లు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎస్‌ఆర్‌ ఎంట్రీ.. ఇలా ప్రతి ఒక్కటీ నకిలీవి తయారు చేశాడు. ఈ పత్రాలతో ఏకంగా అప్పటి కలెక్టర్‌నే బురిడీ కొట్టించాడు. చివరకు సుమారు రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టర్‌ సంతకంతోనే హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం వేయించాడు.

నిరుద్యోగుల ఫిర్యాదుతో వెలుగులోకి...

ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులు లేక జీవితాలు దుర్భరమవుతున్న పరిస్థితుల్లో.. హేమలత నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందిన విషయం ఎలాగోలా బయటకు పొక్కింది. ఈ అక్రమంపై రగిలిన కొందరు నిరుద్యోగులు ఓ సంఘ నాయకుల సాయంతో గత ఏడాది అక్టోబర్‌లో జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై విచారణకు డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్‌ త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ రాజమహేంద్రవరంలో పని చేస్తున్న హేమలతను కాకినాడ పిలిపించి విచారించింది. దీంతో, అసలు విషయం బట్టబయలైంది. హేమలత అందించిన ప్రతి పత్రం నకిలీదేనని, అసలు ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగే కాదని, ఇదంతా అమర్‌కాంత్‌ ఆడించిన నాటకమని, ప్రతి పత్రానికీ అతడే నకిలీ సృష్టించాడని విచారణ కమిటీ గుర్తించింది. ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యాన కలెక్టర్‌కు నివేదించింది.

చర్యలకు ఆదేశం

విచారణ అనంతరం, డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్‌ ద్వారా త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ బాధ్యులిద్దరి పైనా తక్షణ చర్యలకు సిఫారసు చేశారు. ఈ విచారణ నివేదికను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరికి, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ కేవీ శివప్రసాద్‌కు పంపారు. ఈ నేపథ్యంలో అమర్‌కాంత్‌ను ‘తూర్పు’ కలెక్టర్‌ కీర్తి ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. మోసపూరితంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన హేమలతను సస్పెండ్‌ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం చర్యలు చేపట్టనున్నట్లు రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement