మంగళగిరిలో రేపు చేనేత గర్జన | - | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో రేపు చేనేత గర్జన

Feb 21 2026 7:36 AM | Updated on Feb 21 2026 7:36 AM

మంగళగిరిలో  రేపు చేనేత గర్జన

మంగళగిరిలో రేపు చేనేత గర్జన

పెద్దాపురం (సామర్లకోట): తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆప్కో మాజీ డైరెక్టర్‌, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు ముప్పన వీర్రాజు డిమాండ్‌ చేశారు. పెద్దాపురంలోని ఆప్కో కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చేనేత సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదన్నారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మంగళగిరిలో ఆదివారం చేనేత గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చేనేత పరిశ్రమకు గుర్తింపు తీసుకుని రాగా.. 2004లో నాటి సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీ పథకం, రుణమాఫీ ద్వారా ఈ పరిశ్రమను ఉన్నత స్థితికి తీసుకు వచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం అందజేసిందన్నారు. గత ఎన్నికల్లో చేనేత కార్మికులకు ఏటా రూ.25 వేలు ఇస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యి చూపారని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం 30 శాతం రిబేట్‌, పావలా వడ్డీ విడుదల చేయాల్సి ఉందన్నారు. ఆటో డ్రైవర్లకు, మత్స్యకారుల ఉచిత పథకాలకు నిధులు విడుదల చేశారని, తమ బకాయిల గురించి అడుగుతూంటే నిధులు లేవని చెప్పడం వింతగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి 30 శాతం రిబేట్‌ వస్తే నాణ్యమైన వస్త్రాలను ప్రజలకు తక్కువ ధరకే విక్రయించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 వరకూ చేనేత సంఘాలున్నాయని, వాటిలోని కార్మికులకు సక్రమంగా కూలి అందే అవకాశం లేకపోవడంతో అనేక మంది ఇతర రంగాల వైపు మళ్లిపోతున్నారన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మంగళగిరిలో జరిగే చేనేత గర్జనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులందరూ పాల్గొనాలని వీర్రాజు విజ్ఞప్తి చేశారు.

సంక్షేమ పథకాలు

అమలు చేయాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయా లని ఏపీ బిల్డింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నిట్ల శ్రీను డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కార్మిక శాఖ జిల్లా ఉప కమిషనర్‌ (డీసీ) వల్లీకి ఆయన కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సంక్షేమ పథకాల అమలు తేదీలు చెప్పకుండా భవన నిర్మాణ కార్మికులను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని ఈ సందర్భంగా శ్రీను విమర్శించారు. అర్హులై ఉండి పధకాలు పొందని భవన నిర్మాణ కార్మికులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని, 50 ఏళ్లు దాటిన ప్రతి కార్మికుడికీ సంక్షేమ బోర్డు నిధుల నుంచి పెన్షన్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులందరూ తక్షణం తమ గుర్తింపు కార్డులను రెన్యువల్‌ చేసుకోవాలని, అలాగే, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం తమ వివరాలను కార్మిక శాఖ అధికారులకు ఈ నెల 23వ తేదీలోగా అందించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓరుగంటి నందీశ్వరుడు, సీఐటీ యూ నాయకుడు చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల సత్యనారాయణ, ఆనంద్‌, పెద్దాపురం ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూని యన్‌ నాయకులు చింతల సత్యనారాయణ, జుత్తుగ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

జూలైలో ఎస్‌వీ రంగారావు

కళాపరిషత్‌ నాటిక పోటీలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఎస్‌వీ రంగారావు కళాస్రవంతి ఆధ్వర్యాన జూలై మొదటి వారంలో రాష్ట్ర స్థాయి ద్వితీయ నాటిక పోటీలు నిర్వహిచనున్నట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి పి.వెంకన్నబాబు తెలిపారు. కళాస్రవంతి కార్యవర్గ సమావేశం శుక్రవారం కాకినాడలో నిర్వహించారు. 2026–27 సంవత్సరానికి ఎస్‌వీ రంగారావు రాష్ట్ర స్థాయి కళా పురస్కారాలను పిఠాపురం మండలం మల్లాం నటరాజ్‌ ఆర్ట్స్‌ నాటక కళాపరిషత్‌ అధ్యక్షుడు నల్లంశెట్టి వీరశంకరరావుకు, తెలంగాణ రాష్ట్రం జనగాంకు చెందిన నెల్లుట్ల ఫౌండేషన్‌ అధ్యక్షుడు రవీంద్రరావుకు అందజేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కళాస్రవంతి అధ్యక్షుడు పసుపులేటి జె.చంటిరెడ్డి, గౌరవాధ్యక్షుడు పేపకాయల రామకృష్ణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గళ్లా పద్మారావు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement