ఖడ్గమాల పూజకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

ఖడ్గమాల పూజకు శ్రీకారం

Feb 21 2026 7:36 AM | Updated on Feb 21 2026 7:36 AM

ఖడ్గమ

ఖడ్గమాల పూజకు శ్రీకారం

వనదుర్గమ్మ ఆలయంలో

ఘనంగా ప్రారంభం

ప్రతి శుక్రవారం ఉదయం

7.30కు నిర్వహణ

అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారి ఆలయంలో కొత్తగా చేపడుతున్న ఖడ్గమాల పూజకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 10.30 గంటలకు వేద పండితుల ఆశీస్సుల నడుమ సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, ఇతర అర్చకులు నీరాజనం సమర్పించారు. కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు మంత్రోచ్చారణల నడుమ శ్రీచక్రానికి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.త్రినాథరావు దంపతులు కుంకుమతో ఖడ్గమాల పూజ చేశారు. అనంతరం అమ్మవారికి అర్చకులు పులిహోర, గారెలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వనదుర్గ అమ్మవారికి ప్రతి శుక్రవారం ఖడ్గమాల పూజ నిర్వహించడం చాలా గొప్ప విషయమని చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి వనదుర్గ అమ్మవారంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇకపై ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకూ వనదుర్గ అమ్మవారి ఆలయంలో ఖడ్గమాల పూజ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు రూ.1,116 టికెట్టుతో ఈ పూజలో పాల్గొనవచ్చన్నా రు. ఈ టికెట్లు దేవస్థానం కౌంటర్లు, వనదుర్గ అమ్మ వారి ఆలయం వద్ద లభిస్తాయి. ఆన్‌లైన్‌లో aptemples.apgov.in వెబ్‌సైట్‌ ద్వారా అన్నవరం దేవస్థానం సైట్‌లో రూ.1,116 చెల్లించి, టికెట్లు పొందవచ్చు. ఈ పూజ కోసం రాగి రేకుపై ఒకవైపు శ్రీచక్రం, మరోవైపు అమ్మవారి చిత్రం ముద్రించిన 50 యంత్రాలు, 100 ఇత్తడి పళ్లాలు, 100 పంచపాత్రలు, ఉద్ధరిణులను వ్రత పురోహిత సూపర్‌వైజర్లు ప్రయాగ అంజిబాబు, దేవులపల్లి సూర్యనారాయణ, డ్యూటీ స భ్యులు ఈఓ త్రినాథరావుకు శుక్రవారం అందజేశారు.

స్కూటర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

వ్రత పురోహితుడి దుర్మరణం

కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు

అన్నవరం: స్థానిక ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నవరం దేవస్థానంలో అదనపు వ్రత పురోహితునిగా పని చేస్తున్న పైన రఘునాథశర్మ (19) దుర్మరణం పా లయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం నుంచి తుని వెళ్తున్న అల్ట్రా పల్లె వెలుగు బస్సు అన్నవరం మెయిన్‌ రోడ్డు నుంచి ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ లోపలకు వేగంగా వెళ్తోంది. అదే సమయంలో స్కూటీపై రోడ్డు దాటుతున్న రఘునాథశర్మను బలంగా ఢీకొంది. బస్సు వెనుక టైర్లు మీద నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. స్కూటర్‌ మీద వెనుక కూర్చున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. స్కూటర్‌ సగ భాగం బస్సు కిందకు పోయి నుజ్జునుజ్జయ్యింది. రఘునాథశర్మ సంపాదన పైనే అతడి కుటుంబం ఆధారపడి జీవనం సాగిస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా బస్సు ఢీకొని అతడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అంది వచ్చిన చెట్టంత కొడుకును ఆ దేవుడు నిర్దయగా తీసుకుపోయాడని రోదిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఇబ్బందులు

అన్నవరం బస్‌ కాంప్లెక్స్‌ లోపలకు వచ్చేటపుడు ఆర్టీసీ డ్రైవర్లు చాలా వేగంగా బస్సులు నడుపుతున్నారు. దీంతో, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇదే ప్రదేశంలో బస్సు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ప్రధానంగా రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి వస్తున్న పలువురు ఆర్టీసీ డ్రైవర్లు ఎదురుగా వస్తున్న వారిని గమనించకుండా బస్సులను వేగంగా నడుపుతూండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా ర్యాష్‌గా బస్సులు నడిపే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఖడ్గమాల పూజకు శ్రీకారం1
1/2

ఖడ్గమాల పూజకు శ్రీకారం

ఖడ్గమాల పూజకు శ్రీకారం2
2/2

ఖడ్గమాల పూజకు శ్రీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement