గంజాయి రవాణాలో నలుగురి అరెస్ట్
దేవీపట్నం: గంజాయిని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు దేవీపట్నం ఎస్సై షరీఫ్ తెలిపారు. శుక్రవారం ఉదయం పోతవరం సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా, పాత దండంగి గ్రామం నుంచి ఇందుకూరుపేట వైపునకు రెండు బైక్‌లపై ప్లాస్టిక్ సంచులలో 30 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న నలుగురిని అదుపులో తీసుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుల్లో కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్లపాలేనికి చెందిన పంపన కృష్ణబాబు, ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామానికి చెందిన గెద్దాడ మణికంఠ, కాకినాడ జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రు గ్రామానికి చెందిన గుబ్బల ఈశ్వర్‌రామ్‌తో పాటు మరో బాలుడు ఉన్నాడు. వీరిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఎస్సై వివరించారు.


