ఎవరెస్ట్ అధిరోహణకు విద్యార్థిని ఎంపిక
కాజులూరు: దివ్యాంగుల విభాగం నుంచి ఎవరెస్ట్ అధిరోహణకు కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని పితాని రూపాసాయిశ్రీ ఎంపికై నట్టు ఎంఈఓ డేవిడ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆ పాఠశాలలో స్కూల్ హెచ్‌ఎం ఎస్‌ఎస్‌బి సుశీలామణి ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. పది రోజుల క్రితం కడప జిల్లా గండికోటలో ప్రత్యేక అవసరాల కేటగిరీలో దివ్యాంగుల విభాగం నుంచి ఎవరెస్ట్ అధిరోహికుల ఎంపిక జరిగిందన్నారు. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాలికల విభాగం నుంచి గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్ తొమ్మిదో తరగతి విద్యార్థిని రూపాసాయిశ్రీ ఎంపికై ందన్నారు. లడాక్‌లో ఈ నెల 23 నుంచి మార్చి 6వ తేదీ వరకూ శిక్షణ ఇచ్చి ఎవరెస్ట్ అధిరోహణకు పంపిస్తారన్నారు. రూపాసాయిశ్రీని స్కూల్ పీడీ జి.సునీల్‌కుమార్, స్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ ముర్రె శివశంకర్, సర్పంచ్ ప్రసన్నమౌనిక, ఉప సర్పంచ్ తాడి భువనేశ్వరీదేవి తదితరులు అభినందించారు. గొల్లపాలేనికి చెందిన విద్యార్థిని ఎవరెస్ట్ అధిరోహణకు ఎంపిక కావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ టీమ్‌కు కాజులూరు దివ్యాంగుల పాఠశాల ఉపాధ్యాయుడు ఎంజే జయప్రకాశ్‌రెడ్డి కోచ్‌గా ఎంపిక కావటం గర్వించదగ్గ విషయమని ఎంఈఓ డేవిడ్ అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికై న 25 మంది విద్యార్థులకు జయప్రకాశ్‌రెడ్డి నిపుణులతో లడాక్‌లో శిక్షణ ఇచ్చి, ఎవరెస్ట్ అధిరోహణకు తీసుకు వెళ్తారన్నారు.


