దందానతాన..
● తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు
● అధికార అండతో రాత్రి వేళల్లో తరలింపు
● చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
అల్లవరం: తీర ప్రాంతం.. విలువైన భూములకు కేంద్రం. అలాంటి భూములపై కొందరి కన్ను పడింది. అదే అక్రమ దందాకు వేదికై ంది. అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిపట్నం గ్రామాల్లో తీర ప్రాంతం ఉంది. ఆ భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డూ అదుపు లేకుండా రాత్రి వేళల్లో ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. ఇలా రూ.కోట్ల ఆదాయం దారి తప్పుతోంది. ఇసుక తవ్వి తరలించిన ప్రాంతాల్లో అనధికార అక్రమ రొయ్యల చెరువులు పుట్టుకొస్తున్నాయి. ఆయా గ్రామాల్లో రెవెన్యూ, మత్స్య శాఖ అధికారులు నిత్యం తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అటు వైపు చూడడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందన ఉండడం లేదని పలువురు వాపోతున్నారు. గతంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం తరచూ దాడులు నిర్వహిస్తుండడంతో ఇసుక దందా ఎక్కడా జరిగేది కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పట్టించుకునే వారే కరవయ్యారు. రెవెన్యూ, పోలీస్, మైన్స్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో మాత్రమే ఇసుక తరలించుకోవాలని అనధికార ఆదేశాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఆ భూముల్లోనే ఎందుకంటే..
ఓడలరేవు, కొమరగిరిపట్నం రెవెన్యూ గ్రామాల్లో తీరం ఏడు కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన ఉన్న ఇసుక భూముల్లో ఈ దందా సాగుతుంది. డీ– పట్టా, జిరాయితీ భూముల్లో ఈ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రైతుల నుంచి ఇసుక తవ్వుకుని తరలించుకునేందుకు ఎకరానికి రూ. 5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు లీజుకు ఒప్పందం చేసుకుని, మూడు మీటర్ల లోతున ఇసుక తవ్వి రవాణాకు అనువైన ప్రాంతాల్లో స్టోర్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాలకు పదులు సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ఇసుక తవ్విన క్షేత్రాల్లో గట్లు చదును చేసి రొయ్యల సాగు చేస్తున్నారు. మత్స్యశాఖ అధికారులు కనీసం పరిశీలన చేసి అనధికార సాగుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు మండి పడుతున్నారు.
● అలాగే ఓడలరేవు నుంచి కొమరగిరిపట్నం శివారు ఎన్.రామేశ్వరం వరకూ సుమారు వెయ్యి ఎకరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక దిండ్లను తవ్వేసి, ఆపై సమాంతరంగా ఉన్న ఇసుక భూముల్లో కూడా అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాల నిమిత్తం రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవడం, ఆపై తెర వెనుక రియల్టర్ల భూములకు తరలించి భారీగా సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకకు రూ.2 నుంచి రూ.2,200 వరకూ, లారీ ఇసుకై తే రూ. 7 వేల నుంచి దూరాన్ని బట్టి రూ. 10 వేల వరకూ తీసుకుంటున్నారు.
దొరికిన కాడికి దోచేయ్.. జేబులు నింపేయ్ అన్నట్లు ఇసుక దందా సాగుతోంది. కళ్లెదుటే అక్రమ దందా సాగుతుంటే, అరికట్టాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది.. విలువైన భూములు కరిగిపోతున్నా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా మనకెందుకులే అన్నట్లు వదిలేస్తోంది. అధికార అండతో కొందరు ఇష్టమొచ్చినట్లు ఇసుకను తరలిస్తూ అడిగే వారెవరంటూ సాగిపోతున్నారు.. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో జరుగుతున్న తంతు ఇది.
అక్రమ మార్గాల్లో రవాణా
ఇసుక అక్రమ రవాణాను గ్రామస్తుల సహకారంతో ఇటీవల అడ్డుకున్నాం. దీంతో తాత్కాలికంగా నిలిపివేసి ఇప్పుడు రూటు మార్చారు. ప్రత్యామ్నాయ దారుల్లో ఇసుక రవాణా సాగిస్తున్నారు. ఆ లారీలు, ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తుంటే, వారిపై కేసులు నమోదు చేయకుండా వదిలేస్తున్నారు. ఇటీవల పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
–పెచ్చెట్టి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు, కొమరగిరిపట్నం
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
తీరం పొడవునా సీఆర్‌జెడ్ పరిధిలో అనధికారి ఇసుక తవ్వకాలు, రవాణాపై ఇటీవల జిల్లా కలెక్టర్‌ని కలసి ఫిర్యాదు చేశాం. పర్యావరణానికి హాని కలిగించే ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరాం. అయితే అధికారులు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇసుక తవ్వకాలతో ఓడలరేవు, కొమరగిరిపట్నం గ్రామాలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి పెను ముప్పు పొంచి ఉంది.
– భైరిశెట్టి రామారావు, కొమరగిరిపట్నం, అల్లవరం మండలం
దందానతాన..
దందానతాన..


