విషపు కాటు
పసి మొగ్గలపై
చైల్డ్ పోర్నోగ్రఫీ
అరచేతిలోకి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణం పరిపాటిగా మారింది. వీటిని వీక్షిస్తున్న వారిని సాంకేతికత ఆధారంగా గుర్తించి భరతం పట్టాల్సిన పోలీసు శాఖ ఈ విషయంలో విఫలమవుతోంది. అశ్లీల వీడియోలు చూస్తున్న ఎంతో మంది వికృత చేష్టలతో పసిమొగ్గలను చిదిమేస్తున్నారు.
తాచుపాముల తావుల్లో విషపు కాటుకు గురై.. పువ్వంటి బాల్యం బుగ్గిపాలవుతోంది. ఆకులు రాలి, మోడువారిన చెట్టులా వెక్కివెక్కి ఏడుస్తోంది. పరమాన్నం పెట్టేవాడు పరమాత్మ కాదని, ఆటబొమ్మలిచ్చే వాడు ఆదుకొనేవాడు కాడని గుర్తించలేక.. పసిప్రాయం కామాంధుల దాహానికి కర్కశంగా బలవుతోంది. మృగాళ్ల కాటుకు బలై.. తల్లై.. ప్రసవ వేదనతో చిక్కిశల్యమై.. కన్నవారికి బరువై తల్లడిల్లిపోతోంది.
కాకినాడ క్రైం: ఆడపిల్ల పుడితే సాక్షాత్తూ ఆ శ్రీమహాలక్ష్మే తమ కడుపున పుట్టిందని తల్లిదండ్రులు మురిసిపోతారు. రెక్కలు విచ్చుకున్న సీతాకోకచిలుకలా.. ఘల్లుమనే గజ్జెల సవ్వడితో నట్టింట్లో నడయాడుతూంటే ఆనందపరవశులవుతారు.. అటువంటి పసిమొగ్గలు.. లోకం పోకడలు తెలియని ప్రాయంలోనే కామాంధుల చేతుల్లో బలైపోతున్నారు. రేపటి తరాన్ని అందించాల్సిన బాలికలపై.. అక్క, చెల్లి, కూతురు, మనవరాలు.. ఇలా అన్ని వావివరుసలనూ మరచిన మృగాళ్లు.. ముక్కుపచ్చలారని వయస్సులోనే అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఆ బాధిత బాలికలు పసి ప్రాయంలోనే గర్భవతులై జీవచ్ఛవాలుగా మిగిలిపోతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఏడాది వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 13 మంది బాలికలు మృగాళ్ల అఘాయిత్యాలకు గురై, గర్భం దాల్చారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఉంటుందన్నది అంచనా. గర్భం దాల్చిన వారు కాకుండా.. లైంగిక దాడులకు గురైన వారు మరెంతో మంది ఉంటున్నారు.
విలువలు లుప్తం..
లోపిస్తున్న భయం
ఫ సమాజంలో నానాటికీ విలువలు లుప్తమవడం ఈ అకృత్యాలకు జరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతోపాటు అవగాహన లోపం, బలప్రయోగాలకు గురవడం, సరైన పెంపకం లేకపోవడం వంటివి కూడా కారణాలవుతున్నాయి.
ఫ బాలికలపై అత్యాచారం చేసి, హత్య కూడా చేసిన సంఘటనలు దేశంలో, రాష్ట్రంలో ఎన్నో జరిగాయి. అయినప్పటికీ నిందితులపై కఠిన చర్యలు చేపట్టడం లేదు. చట్ట ప్రకారం చర్యలున్నా, అవి తీవ్ర స్థాయిలో లేకపోవడంతో ఘాతుకానికి పాల్పడుతున్న వారికి భయం లేకుండా పోతోంది. ఎలాగైనా తప్పించుకోవచ్చనే భావనను కలిగిస్తోంది. కేసులు ఆలస్యంగా నమోదవడం, సాక్ష్యాలు లభించకపోవడం, రాజీ యత్నాలు, బాధిత బాలలు ఫిర్యాదు చేయలేకపోవడం మృగాళ్లకు కలిసొస్తున్నాయి. ఫలితంగా బాధితులకు తక్షణ న్యాయం లభించడం లేదు. దీంతో, చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యమైపోతున్నాయి.
ఫ కొన్ని సందర్భాల్లో పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ ఉండని దుస్థితి. కొంత మంది పిల్లలను బంధువుల ఇళ్లల్లో ఉంచి, జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అలా తల్లిదండ్రులు లేని లోటుతో జీవితాన్ని గడుపుతున్న పిల్లలకు కామాంధులు రకరకాల ఆకర్షణలు ఎరగా వేస్తున్నారు. అలాగే, బాల కార్మికులు, బిచ్చగాళ్లుగా జీవిస్తున్న చిన్నారులు లైంగిక దోపిడీకి గురవుతున్నారు.
ఫ అసురక్షిత పరిస్థితుల్లో లైంగిక దాడులు జరుగుతూండటంతో పలువురు బాలికలు గర్భవతులవుతున్న దుస్థితి నెలకొంది.
‘సమ్మతి’ అనే ప్రశ్నే లేదు
ఇలాంటి దురాగతాల్లో బాధిత బాలికను పెళ్లి చేసుకుంటామని ఎర వేయడం పరిపాటిగా మా రింది. నిరుపేద, వెనుకబడ్డ, తల్లిదండ్రులు లేక సంరక్షకుల వద్ద బతుకీడుస్తున్న అనాథ బాలల వర్గాల్లో ఇది పరిపాటిగా మారింది. వివాహం చేసుకుంటే కేసు రద్దవదు. కేసుతో పాటు నేరం చేసినందు వల్ల చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ పరిధిలో చట్ట పరమైన చర్యలు తప్పవు. ఇది కాక, పోక్సో చట్టం వర్తిస్తుంది. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా విధించవచ్చు. నేరంలో క్రూరత్వం స్పష్టమైతే మరణ దండనకూ ఆస్కారం ఉంటుంది. మైనర్లపై లైంగిక దోపిడీలో ‘సమ్మతి’ అనే ప్రశ్నే లేదు. – ఎండీ జవహర్ ఆలీ,
ప్రముఖ న్యాయవాది, కాకినాడ
పెడోఫిలిక్ డిజార్డర్‌తో..
పెడోఫిలిక్ డిజార్డర్ అనే మానసిక సమస్య వల్ల కూడా పసివాళ్లపై లైంగిక వాంఛలకు లోనవుతూంటారు. వారితో తమ కోరిక తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికై నా ఒడిగడతారు. అలాగని ఘాతుకానికి పాల్పడిన ప్రతి వాడూ పెడోఫైల్ కాదు, ప్రతి పెడోఫైల్ నేరం చేస్తాడనీ లేదు. ఈ సమస్య వల్ల నేరం చేశానని తప్పించుకునే అవకాశం లేదు. వ్యక్తి సమస్యతో బాధపడుతున్నాడా లేదా అన్నది గుర్తించడం వైద్యపరంగా సులభమే. చిన్న పిల్లలపై చెడు ఆలోచనలు కలిగితే తక్షణమే మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించాలి. సైకియాట్రిక్ కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపీ, ఇంపల్స్ కంట్రోల్ మెడిసిన్ ద్వారా సమస్యను నియంత్రించవచ్చు. – డాక్టర్ వానపల్లి వరప్రసాద్,
మానసిక వ్యాధుల నిపుణుడు, హెచ్‌ఓడీ (ఇన్‌చార్జి),
రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ
ఫ చిన్నారులపై వరుస అఘాయిత్యాలు
ఫ లేత వయసులోనే గర్భం దాల్చుతున్న దుస్థితి
ఫ అధికారికంగా 13 మంది
ఫ అనధికారికంగా మరింత మంది!
ఫ చేష్టలుడిగి చూస్తున్న యంత్రాంగం
ఫ గత మే నెలలో కిర్లంపూడిలో 13 ఏళ్ల బాలికకు పక్కింటి వృద్ధుడు చాక్లెట్లు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఓ తాతయ్య చాక్లెట్లు ఇస్తున్నాడని ఆ బాలిక పాఠశాలలో తోటి స్నేహితులకు చెప్పడంతో.. ఆ పిల్లలు కూడా చాక్లెట్ల కోసం వెళ్లగా.. వారిపై కూడా ఆ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఫ ఇలా ఏడుగురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో ఓ బాలిక గర్భవతి కావడంతో అధికారుల అనుమతితో అబార్షన్ చేయించారు.
ఫ గండేపల్లి మండలం సూరంపాలెంలో 13 ఏళ్ల బాలికపై ఓ లారీ డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పెద్దమ్మ ఇంటికి వెళ్తే కన్ను వేసి, బెదిరించి పలుమార్లు దారుణానికి తెగబడ్డాడు, ఆ మృగాడి నిర్వాకంతో ఆ బాలికకు జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగి, ఆడ శిశువు జన్మించింది.
ఫ కాకినాడ జగన్నాథపురంలో 14 ఏళ్ల బాలికపై పొరుగింట్లో ఉంటున్న 40 ఏళ్ల దుర్మార్గుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. గర్భవతి అయిన ఆ చిన్నారికి అబార్షన్ చేయించేందుకు ఇంటర్ చదువుతున్న ఓ యువకుడికి చెప్పాడు. అతడు కూడా ఆ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వీరిద్దరి ఘాతుకానికి బలైపోయిన ఆ బాలిక.. ఆడపిల్లకి జన్మనిచ్చింది.
ఫ గత నవంబర్‌లో ఉప్పాడకు చెందిన 16 ఏళ్ల బాలికకు తినుబండారాలు కొనిచ్చి, తాతయ్య వరుస అయ్యే వ్యక్తి ఘాతుకానికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన ఆ బాలికకు కాకినాడ జీజీహెచ్‌లో అధికారుల ఆదేశాలతో అబార్షన్ చేశారు.
ఫ కాకినాడ అచ్చంపేటకు చెందిన 17 ఏళ్ల బాలికను ఓ వివాహితుడు ప్రేమ పేరుతో మోసగించి, దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఆ బాలిక గత నవంబర్ 29న బాబును ప్రసవించింది. ఆ శిశువును శిశుగృహకు అప్పగించారు.
ఫ బాబాయి అత్యాచారం చేయడంతో తాళ్లరేవులో 16 ఏళ్ల బాలిక గత అక్టోబర్‌లో పాపను ప్రసవించింది.
ఫ పిఠాపురానికి చెందిన 15 ఏళ్ల బాలికపై సొంత బంధువే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అధికారుల ఆదేశాలతో ఆమెకు అబార్షన్ చేశారు.
ఫ కరప మండలం నడకుదురుకు చెందిన ఓ బాలికను తెలిసున్న వ్యక్తే నమ్మించి మోసం చేశాడు. కాకినాడ కోకిల సెంటర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ బాలిక మగ శిశువును ప్రసవించింది. ఆ శిశువును అధికారులకు అప్పగించారు.
ఫ ఇవన్నీ కేవలం ఏడాది వ్యవధిలో జరిగిన దారుణాలు. మచ్చుకు కొన్నే అయినా, అభంశుభం తెలియని బాలికలపై అఘాయిత్యాలు ఏ రీతిలో జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
చేతులెత్తేసిన సర్కారు
బాలికలపై దురాగతాల్ని నిలువరించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. బాధ్యత వహించాల్సిన పోలీస్, మాతా శిశు సంక్షేమ శాఖ అనుబంధ విభాగాలు, రూ.కోట్లు వెనకేసుకుంటున్న ఎన్‌జీవోలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అవగాహన కార్యక్రమాల పేరుతో ఫొటోలకే పరిమితమవుతున్నారు. అక్కడక్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా అవి ఫలవంతంగా జరగడం లేదనే విమర్శలున్నాయి. పాఠశాల లేదా మరేదైనా ప్రాంతంలో ఒకసారి సదస్సు నిర్వహించి వదిలేస్తున్నారు. దీనివలన ప్రయోజనం ఎంతవరకూ ఒనగూడిందనే పరిశీలన ఉండటం లేదు. అలాగే, బాధిత బాలికలు చేరి, సాంత్వన పొందే విభాగంలో కనీసం వారి డేటా కూడా తగిన రీతిలో నిర్వహించడం లేదు.
విషపు కాటు
విషపు కాటు


