కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి చూపారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2025–26 బడ్జెట్‌లో మొత్తం వ్యయం రూ 50,65,345 కోట్లుగా ప్రకటించి, సవరించిన అంచనాల్లో రూ.49,64,842 కోట్లకు తగ్గించి, ఇప్పుడు మళ్లీ రూ.53,47,315 కోట్లుగా ప్రకటించారని ఇది ప్రజలను మోసగించడమేనని పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు, నిర్వాసితులకు తక్కువగా నిధులు కేటాయించి తీవ్ర అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు అండదండలతో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఏపీకి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులతో నిధులు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. ఏపీలో గ్రామీణ రహదారులు, పట్టణ మురుగు నీటిపారుదల, ప్రకృతి వ్యవసాయం, రహదారులు, వంతెనలు, అమరావతి రాజధానికి, అమరావతి సమీకృత పట్టాభివృద్ధికి అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంకు అప్పులతో కేటాయించడం సిగ్గుమాలిన చర్యని ఆయన దుయ్యబట్టారు. మెడికల్ టూరిజం తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం పేద ప్రజలకు తీవ్ర హాని చేస్తుందని, వైద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు ఎన్‌ఆర్‌ఐలను ఆహ్వానించారని చెప్పారు. కోటిపల్లి రైల్వే లైనుకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా కోనసీమ వాసులకు తీవ్ర నిరాశ మిగిల్చారని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో 125 రోజుల పని దినాలు అమలు చేస్తామంటూనే అతి తక్కువగా రూ.95 కోట్లు కేటాయించడాన్ని కూడా పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. నిజంగా 125 రోజులు పని ఇవ్వాలంటే కనీసం రూ.3 లక్షల కోట్లు కావాలని, దీనినిబట్టి ఈ పథకాన్ని క్రమంగా రద్దు చేయడానికి మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోందని మధు విమర్శించారు.
బడ్జెట్‌తో రాష్ట్రానికి మేలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్ర బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తుందని ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అన్నారు. కాకినాడలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కీలకమైన 17 రకాల అరుదైన భూగర్భ ఖనిజాల వెలికితీతకు అవసరమైన పరిశోధన సంస్థల ఏర్పాటుకు ఒక కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించి, ఇందులో ఆంధ్రప్రదేశ్‌ను భాగస్వామిని చేశారన్నారు. దీనివలన రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయన్నారు. చేప, రొయ్య ఎగుమతులకు మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారని చెప్పారు. కొబ్బరి, జీడిపప్పు పరిశ్రమ ప్రోత్సాహానికి వివిధ పథకాలు ప్రకటించారని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని, కోకో సాగు పెంచేందుకు ఎక్కువ ప్రోత్సాహకాలు అందించారని, ఇతర దేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, నాయకులు పైడా కృష్ణమోహన్, యార్లగడ్డ రామ్‌కుమార్, ముత్తా నవీన్, గట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు లోవ దేవస్థానానికి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. క్యూలో 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు, పూజా టికెట్లు, తలనీలాలు, వసతి గదుల అద్దెలు, విరాళాల ద్వారా రూ.3,93,652 ఆదాయం లభించిందని వివరించారు.
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచెయ్యి


