కూటమి పాలనలో ప్రజలకు రక్షణ కరవు
గండేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తోట నరసింహం ఆధ్వర్యాన మండలంలోని సింగరంపాలెంలో ఆదివారం జరిగిన సంస్థాగత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చట్టాలకు బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతోందని మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదంటూ కోర్టుకు సీబీఐ సిట్ నివేదిక ఇవ్వడం హర్షణీయమన్నారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను దోషులుగా ఆరోపిస్తూ ఫ్లెక్సీలు వేయడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు మనస్తాపానికి గురయ్యారన్నారు. కూటమి శ్రేణులు రెచ్చిపోయి, అంబటిపై హత్యాయత్నానికి పాల్పడటం, పోలీసులు ఆయనను అరెస్టు చేయడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకుని చట్టపరంగా వ్యవహరించాలని.. ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తున్నా అధికార యంత్రాంగం నోరు మెదపకపోవడం విచారకరమని అన్నారు. గవర్నర్ తక్షణం జోక్యం చేసుకుని రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా అడ్డుకోవాలని సూర్యనారాయణరాజు విజ్ఞప్తి చేశారు. పార్టీ సోషల్ మీడియా, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో వివిధ విభాగాల్లో పదవులు పొందిన వారికి ఉగాది నాటికి గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో కమిటీల నియామకం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు మద్దిపట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రాంజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ లీగల్ సెల్ చైర్మన్ గుల్లా ఏడుకొండలు, జిల్లా ఉపాధ్యక్షుడు రామకుర్తి మూర్తి, నియోజకవర్గ పరిశీలకుడు కొప్పన శివనాథ్, ఎంపీపీలు చలగళ్ల దొరబాబు, సుంకర శ్రీవల్లి దొరబాబు, ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి తాళ్లూరి మధు కుమార్, ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా అధ్యక్షుడు అవసరాల పార్థసారథి, పార్టీ జగ్గంపేట మండల అధ్యక్షుడు రావుల గణేష్ రాజా, నాయకులు కోర్పు దుర్గాప్రసాద్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు కరుటూరి వీర్రాజు, అధికార ప్రతినిధి కరుటూరి శ్రీను, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు బేకరీ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఫ అంబటి రాంబాబు అరెస్టు అన్యాయం
ఫ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
ఫ వైఎస్సార్ సీపీ నేత దాట్ల సూర్యనారాయణరాజు


