రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శనానికి సుమారు 50 వేల మంది రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిశాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 6,800 జరిగాయి. వీటిల్లో 4,800 రూ.300 టికెట్టుపై, మిగిలిన 2 వేలు రూ.వెయ్యి, రూ.1,500, రూ.2 వేల టికెట్లతో జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. ఒక్క వ్రత విభాగం ద్వారానే రూ.30 లక్షల రాబడి వచ్చింది. మరో రూ.15 లక్షలు ప్రసాద విక్రయాల ద్వారా సమకూరింది. ఇతర విభాగాల ద్వారా రూ.15 లక్షలు వచ్చింది. సర్కులర్ మండపం వద్ద సుమారు 20 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంచిపెట్టారు. నిత్యాన్నదాన పథకంలో 2 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఆలయ ప్రాంగణంలోను, లిఫ్ట్ వద్ద ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈఓ వి.త్రినాథరావు కూడా ఆలయ ప్రాంగణం, ప్రసాదం, అన్నదానం, వ్రతాలు తదితర విభాగాల్లో పర్యటించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. పూజల అనంతరం, చైర్మన్ రోహిత్ కొబ్బరికాయ కొట్టి రథ సేవను ప్రారంభించారు. ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు ఊరేగించారు.
ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది
ఫ రూ.60 లక్షల ఆదాయం
రత్నగిరికి పోటెత్తిన భక్తులు


