వైఎస్సార్ సీపీ నేతలపై పథకం ప్రకారం దాడులు
కాకినాడ రూరల్: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ శ్రేణులపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగిస్తోందని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైఎస్సార్ సీపీ నేతలపై ఓ పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రమంతటా విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తూ గోరంట్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని కోరిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడికి పాల్పడటం హేయమమని దుయ్యబట్టారు. అంతటితో ఆగకుండా ఆయన ఇంటిని ధ్వంసం చేసి, నిప్పు పెట్టడం దారుణమన్నారు. బాధితుడైన అంబటి పైనే తిరిగి కేసులు నమోదు చేయడాన్ని నాగమణి ఖండించారు. దాడి చేసిన టీడీపీ గూండాలను వదిలేసి, అంబటిపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. గతంలో వంగవీటి మోహనరంగా, మొన్న ముద్రగడ పద్మనాభం, తాజాగా అంబటిపై దాడులు చేస్తూ.. పథకం ప్రకారం కాపులను అణగదొక్కాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. తిరుమల లడ్డూ ప్రసాదం, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, విశాఖ గీతం యునివర్సిటీ భూకబ్జా వ్యవహారాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వమే అంబటిపై దాడి చేయించిందని ఆరోపించారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీ జరగలేదంటూ సీబీఐ సిట్ ఇచ్చిన నివేదికపై వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్రమంగా కేసులు పెట్టడం సరికాదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లో మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, పేర్ని నాని, విడదల రజని, అంబటి రాంబాబు సహా మాజీ ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడుపై దాడి చేశారని గుర్తు చేశారు. మరో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారని చెప్పారు. ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఇలాంటి విధ్వంసాలకు పాల్పడేందుకా అని ప్రజలు వాపోతున్నారని నాగమణి పేర్కొన్నారు.


