రూ.12 లక్షలతో కోటి తులసి పూజ | - | Sakshi
Sakshi News home page

రూ.12 లక్షలతో కోటి తులసి పూజ

Feb 2 2026 7:21 AM | Updated on Feb 2 2026 7:21 AM

రూ.12 లక్షలతో కోటి తులసి పూజ

రూ.12 లక్షలతో కోటి తులసి పూజ

అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ రూ.12 లక్షల వ్యయంతో కోటి తులసి పత్రి పూజ నిర్వహిస్తున్నట్లు అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. రత్నగిరిపై ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో తాను ఈఓగా ఉన్నప్పుడు 2022 ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకూ ఈ పూజ ఘనంగా నిర్వహించామని చెప్పారు. మళ్లీ ఈ పూజ నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ నెల ఆరో తేదీ ఉదయం 8 గంటలకు పూజ ప్రారంభిస్తామని, 15వ తేదీ రుద్రహోమంతో ఈ క్రతువు ముగుస్తుందని తెలిపారు. రోజుకు 40 బస్తాల తులసి పత్రితో (10 లక్షల దళాలు) రుత్విక్కులు పూజ నిర్వహిస్తారన్నారు. 40 మంది వ్రత పురోహితులు, 20 మంది అర్చకులు, వేద పండితులు ఇందులో పాల్గొంటారని ఈఓ తెలిపారు. రోజూ ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పూజ జరుగుతుందన్నారు. వీటితో పాటు ఇతర పూజలు కూడా చేస్తారు. ఈ పూజకు రూ.50 వేలు చెల్లించిన భక్తులు పది రోజులు పూజలో పాల్గొనవచ్చని, రూ.1,500 చెల్లించిన వారి గోత్రనామాలతో ఒక రోజు పూజ చేస్తారని వివరించారు. పూజకు అవసరమైన తులసి పత్రిని ఒక రోజు ముందే సమర్పించవచ్చున్నారు. పూజకు సంబంధించిన పూర్తి వివరాలు, రుసుం చెల్లించేందుకు www.aptempel.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఈఓ సూచించారు. విలేకర్ల సమావేశంలో వేద పండితులు గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తులసి పత్రి పూజకు చైన్నెకి చెందిన భక్తులు, దాత పీఎస్‌ కుమార గురుపరన్‌, శాంతి దంపతులు రూ.లక్ష విరాళాన్ని దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ త్రినాథరావులకు ఆదివారం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement