మున్సిపల్ డీఈ రీకాల్
● రామచంద్రపురం
మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం
● 17 మంది ఏకగ్రీవ ఆమోదం
● డీసెంట్ తెలిపిన ఏడుగురు కౌన్సిలర్లు
రామచంద్రపురం: మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ డీఈనీ రీకాల్ చేస్తూ ఆదివారం కౌన్సిలర్లు తీర్మానం చేశారు. కొంతకాలంగా కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ డీఈ శ్రీకాంత్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత నెలలో జరిగిన సమావేశంలో కూడా సభ్యులు ఆయనను రీకాల్ చేయాలని కోరారు. ఈ మేరకు స్థానిక మంత్రి సుభాష్‌కు, మున్సిపల్ ఆర్డీ, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాలు అందజేశారు. తాజాగా శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టేబుల్ అజెండాగా డీఈ శ్రీకాంత్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానించింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌తో సహా 17 మంది కౌన్సిలర్లు దీనికి మద్దతు తెలపగా ఏడుగురు మాత్రం డీసెంట్ తెలిపారు. సమావేశంలో అజెండాలోని తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ డీఈ శ్రీకాంత్ పట్టణాభివృద్ధికి ఆటంకంగా మారారని, కౌన్సిల్ సభ్యులను అవమానపర్చడం, పనులు పూర్తి చేసినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి నలుగురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ గాదంశెట్టి శ్రీదేవితో సహా 17 మంది సభ్యులు డీఈని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఒక కౌన్సిలర్ వాడిన పదజాలాన్ని తప్పుపడుతూ పలువురు కౌన్సిలర్లు బైఠాయించారు. దీంతో చైర్‌పర్సన్ వారికి నచ్చచెప్పి అతి కష్టం మీద సమావేశాన్ని అదుపులోకి తీసుకొచ్చి డీఈని సరెండర్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అదే సమయంలో ఏడుగురు కౌన్సిలర్లు డీసెంట్ తెలుపుతూ రాసిన పత్రాన్ని కమిషనర్ రాజుకు అందజేశారు. ఈ అంశంపై వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయి ప్రసాద్ విప్ జారీ చేసినప్పటికీ, ఆ పార్టీ నలుగురు కౌన్సిలర్లు విప్‌ను ధిక్కరించి డీసెంట్‌పై సంతకాలు చేయడం గమనార్హం.


