నకిలీ వే బిల్లులతో ఇసుక తరలింపు
● రెండు లారీల సీజ్
తాళ్లపూడి: మండలం ప్రక్కిలంకలో ఆదివారం తెల్లవారుజామున జిల్లా గనులు, భూగర్భశాఖ, టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేశాయి. ఇసుక రీచ్ ఏజెన్సీలు నకిలీ వే బిల్లులతో ఇసుక తరలిస్తున్నట్టు తేలితే ఆ ఏజెన్సీని రద్దు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ డి.ఫణిభూషణ్‌రెడ్డి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఇసుకను తరలిస్తున్న ఏపీ 39 టీక్యూ 0007, ఏపీ 37 టీఈ 6979 నంబర్లు ఉన్న రెండు వాహనాలను తనిఖీ చేసి వే బిల్లులను స్కాన్ చేశారు. ఏపీఎస్‌ఎంఎస్ పోర్టల్‌లో ఎటువంటి డిస్పాచ్ వివరాలు లేవని గుర్తించి బిల్లులు నకిలీవని గుర్తించి రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అలాగే ప్రక్కిలంక–1 డీసిల్టేషన్ రీచ్‌లో ఇసుక రవాణాకు ఏజెన్సీగా ఎంపికై న ‘ది గణేష్ బోట్స్‌మెన్ – శాండ్ వర్కర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ సంస్థ నకిలీ ఇసుక వే బిల్లులు జారీ చేసినట్లు గుర్తించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎస్సై రామకృష్ణకు సూచించారు. అనంతరం సొసైటీకి కేటాయించిన శాండ్ సప్లై పాయింట్ లాగిన్ ఐడీని ఏపీఎస్‌ఎంఎస్ పోర్టల్‌లో బ్లాక్ చేశారు. ఈ దాడుల్లో జిల్లా మైనింగ్ సర్వేయర్ పట్నాల శ్రీనివాస్, జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై కె.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


