విశ్వబ్రాహ్మణులను చట్ట సభలకు పంపాలి
● సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు
అమలాపురం టౌన్: విశ్వ బ్రాహ్మణులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఏదో ఒకటి ఇచ్చి చట్ట సభలకు పంపించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక దుడ్డివాని అగ్రహారంలోని విశ్వబ్రాహ్మణ కల్యాణ మండపంలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తమ వర్గానికి రాజకీయ పదవులు వచ్చినపుడే మనకు గుర్తింపు, హోదా వస్తాయని పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక సామాజిక, రాజకీయ రంగాల్లో తమ వర్గం అభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆ దిశగానే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. యువజన నాయకుడు ఆవుపాటి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ సామాజిక వర్గ పెద్దలు, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ కట్టోజు సన్నయ్యదాసు, వరద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు, ఆ వర్గం పెద్దలను సంఘీయులు గజమాలతో సత్కరించారు. అనంతరం వారంతా ఎమ్మెల్యే ఆనందరావు వద్దకు వెళ్లి తమ వర్గీయులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని వినతి ప్రతాన్ని అందించారు.


