అలా ఆటాడుకుంటున్నారు
● జీఎంసీలో వివాదాస్పదంగా
పోస్టుల భర్తీ ప్రక్రియ
● మొత్తం ఖాళీలు 162
● గత ఏడాది మొదటి
నోటిఫికేషన్‌లో చూపినవి 77
● రెండో విడతలో 79కి పెంపు
● వేర్వేరు కారణాలతో
మొదటి రెండు నోటిఫికేషన్లూ రద్దు
● మూడోసారి పోస్టులు 60కి కుదింపు
● అధికారులు తమతో
ఆటలాడుకుంటున్నారని అర్హుల ఆగ్రహం
కాకినాడ క్రైం: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల(జీజీహెచ్)లో వివిధ కేడర్లలో పారామెడికల్ సిబ్బంది నియామకానికి చేపట్టిన ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు సంబంధించి 350కి పైగా పారామెడికల్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం జీఎంసీ, కాకినాడ జీజీహెచ్, రంగరాయ వైద్య కళాశాల(ఆర్‌ఎంసీ)తో పాటు వివిధ పీహెచ్‌సీలు, యూహెచ్‌సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివిధ పారామెడికల్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) కార్యాలయం ద్వారానే ఉమ్మడి జిల్లా పోస్టుల భర్తీ చేపట్టారు. అన్నిచోట్లా నియామకాలూ పూర్తయిపోయాయి. అయితే, రాజమహేంద్రవరం జీఎంసీ, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (జీజీహెచ్) పరిధిలోని 79 పోస్టులను తామే భర్తీ చేసుకుంటామని అధికారులు దాదాపు ఏడాదిన్నర కిందట చెప్పారు. కానీ, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను సంబంధిత అధికారులు ఇప్పటి వరకూ పూర్తి చేయలేదు. ఈ పోస్టులకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్హులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించారా..
ఉమ్మడి జిల్లా ఉద్యోగాల నోటిఫికేషన్ కావడం వల్ల నియామక ప్రక్రియ ఆసాంతం కాకినాడ జిల్లా కలెక్టర్ పరిధిలోకే వస్తుంది. జీఎంసీలో పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకూ మూడుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కొద్ది కాలం ముందు మొదటిసారి ఇచ్చిన నోటిఫికేషన్‌లో 77 ఖాళీలు చూపించారు. అభ్యర్థుల అభ్యంతరాల పేరుతో దానిని రద్దు చేసి, గత ఏడాది డిసెంబర్‌లో రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం 79 పోస్టులు చూపారు. అనివార్య కారణాలంటూ దీనినీ రద్దు చేసినట్లు ప్రకటించారు. అయితే, రోస్టర్ నిర్వహణలో లోపం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వంటి కారణాలతోనే రెండో నోటిఫికేషన్ రద్దు చేశారన్నది అభ్యర్థుల వాదన. తాజాగా ఈ నెలలో మూడోసారి ఇచ్చిన నోటిఫికేషన్‌లో 60 మాత్రమే ఖాళీలున్నాయని తెలిపారు. కొన్ని ఉద్యోగాలకు విద్యార్హతలు నిర్ణయించలేదని, అందువలన మూడో నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య కుదించామని చెబుతున్నారు. అదే నిజమైతే అంతకు ముందు రెండుసార్లు అవే పోస్టులకు నోటిఫికేషన్లు ఎలా ఇచ్చారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మూడుసార్లు వేర్వేరుగా ఖాళీలు చూపుతూ, కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించి మరీ ఆయా నోటిఫికేషన్లపై సంతకాలు చేయించారని ఆరోపిస్తున్నారు.
మొత్తం 162 ఖాళీలు
రాజమహేంద్రవరం జీజీహెచ్, జీఎంసీలలో మొత్తం 162 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతానివే 79 కాగా, తాజాగా జీజీహెచ్‌లో మరో 83 ఖాళీలు ఏర్పడ్డాయి. రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆస్పత్రి అధికారులు కోరినా జీఎంసీ అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ 162 పోస్టులను గత నెల నాటికే భర్తీ చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించినా ఫలితం లేకపోయింది. కేవలం 60 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. పాతవి 19, కొత్తవి 83 కలిపి మిగిలిన 102 పోస్టులు ఎందుకు భర్తీ చేయకుండా నిలిపివేశారనేది జవాబు లేని ప్రశ్నగానే ఉంది.
11 కేడర్లకు ఎగనామం
మొత్తం 21 కేడర్లలో సిబ్బందిని నియమించాల్సి ఉండగా.. 10 కేడర్ల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మిగిలిన 11 కేడర్లలోని కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఎలక్ట్రికల్ హెల్పర్, మార్చురీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సైకియాట్రీ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్టు, క్లినికల్ సైకాలజిస్టు పోస్టులను పక్కన పెట్టేశారు.
విద్యార్హతలు నిర్ణయించలేదు
ఖాళీలు ఎక్కువగా ఉన్న మాట నిజమే. అన్ని పోస్టుల భర్తీకీ బదులు 60 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చాం. కొన్ని పోస్టులకు విద్యార్హతలు ఇంకా నిర్ణయించలేదు. సూపర్‌స్పెషాలిటీ పోస్టులు ఇవ్వొద్దని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) ఆదేశించారు. అందుకే నోటిఫికేషన్‌లో ఇవ్వలేదు. అన్నీ నెమ్మదిగా అవుతాయి. కొత్త కాలేజీలకు ఇంకా ఉద్యోగ నియామకాలు జరగలేదు.
– డాక్టర్ కేవీ శివప్రసాద్, ప్రిన్సిపాల్,
రాజమహేంద్రవరం జీఎంసీ
పోస్టులు తగ్గించాలని చెప్పలేదు
సూపర్‌స్పెషాలిటీ సహా ఏ పోస్టులూ తగ్గించాలని లేదా పెంచాలని మేం ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదు. భర్తీకి అనుమతి మాత్రమే ఇచ్చాం. ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా అది పూర్తిగా వారి బాధ్యతే. జీఓ ప్రకారం ఎప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేయాలి. పోస్టుల కుదింపునకు గల కారణాలపై రాజమహేంద్రవరం జీఎంసీ అధికారులు మాకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు.
– డాక్టర్ రఘునందన్ గంభీర, డీఎంఈ
నా జీవితంతో ఆడుకున్నారు
నిరుద్యోగినైన నా జీవితంతో జీఎంసీ అధికారులు ఆడుకున్నారు. నా వయసు 48 ఏళ్లు. మూడోసారి విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ నాటికి నా వయో పరిమితి ముగిసింది. రెండో నోటిఫికేషన్ సమయానికి వయసు ఉన్నా, అకారణంగా నోటిఫికేషన్ రద్దు చేశారు. నేను మంచి మార్కులతో ఐటీఐ ఎలక్ట్రికల్ ఉత్తీర్ణుడినయ్యాను. మెరిట్‌లోనూ ముందున్నాను. రెండో నోటిఫికేషన్ కొనసాగి ఉంటే, మెరిట్ ఆధారంగా నాకే ఉద్యోగం వచ్చేది. అధికారుల నిర్వాకంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగానికి దూరమయ్యాను. నాకు భార్య, పిల్లలు ఉన్నారు. వారిని పోషించడానికి ఇంటింటికీ కేబుల్ వైర్లు వేస్తూ పూట గడుపుకొంటున్నాను.
– పి.అశోక్, అభ్యర్థి, కాకినాడ
అలా ఆటాడుకుంటున్నారు
అలా ఆటాడుకుంటున్నారు
అలా ఆటాడుకుంటున్నారు


