కన్నుల పండువగా త్యాగరాజ ఆరాధనోత్సవం
500 మంది కళాకారులతో పంచరత్న సేవ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): త్యాగరాజ స్వామి పంచరత్న కీర్తనలతో కాకినాడ నగరం పులకించిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంగీత కళాకారుల తమ గాత్రం, వాద్య పరికరాలతో అలరించారు. దాదాపు 500 మందికి పైగా కళాకారులు సంప్రదాయ వస్త్రధారణలో చేసిన ఈ అద్భుత ప్రదర్శన నగర ప్రజలను సుస్వరానంద సాగరంలో ఓలలాడించింది. సంగీత, నృత్య, నాటక రంగాల్లో వందేళ్లకు పైగా విశిష్ట సేవలందిస్తున్న సరస్వతీ గానసభ 122 వసంతాల మహోజ్వల ప్రస్థానాన్ని పురస్కరించుకొని త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాన్ని ఆదివారం రాత్రి వేడుకగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, చైన్నె తదితర ప్రాంతాల నుంచి 500 మందికి పైగా లబ్ధప్రతిష్టులైన కళాకారులు పంచరత్న కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. గాత్రం, వయోలిన్, వీణ, వేణునాదం, మృదంగం, ఘటం, కంజీర, మోర్సింగ్ వంటి వాద్యాలతో కళాకారులు అద్భుతమైన సహకారం అందించారు. ప్రఖ్యాత మృదంగ విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు శిష్య బృందం కచేరీ ఆహూతులను ఎంతో ఆనంద పారవశ్యంలో ముంచెత్తింది. పంచరత్న సేవను ప్రారంభించిన ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు.. త్యాగరాజ స్వామిపై చేసిన ప్రవచనం విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 500 మంది కళాకారులు ఒకే వేదికపై ఇటువంటి అద్భుత ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి అని సరస్వతీ గాన సభ గౌరవాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి తెలిపారు. సరస్వతీ గానసభ జీవితకాల చైర్మన్ కొమిరెడ్డి శ్రీరామ నరసింగరావు, అధ్యక్షుడు డాక్టర్ ముళ్లపూడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు లక్కరాజు సత్యనారాయణ, కార్యదర్శి పేపకాయల రామకృష్ణ, సహాయ కార్యదర్శి చెరుకువాడ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కన్నుల పండువగా త్యాగరాజ ఆరాధనోత్సవం


