రత్నగిరిపై రద్దీ
అన్నవరం: రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 25 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 2 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను టేకు రథంపై ఉదయం ఘనంగా ఊరేగించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కొబ్బరికాయ కొట్టి రథ సేవను ప్రారంభించారు.
1న భారీ త్రిముఖ
సాయి విగ్రహావిష్కరణ
తుని రూరల్: మండలంలోని మరువాడ శివారున నిర్మించిన 120 అడుగుల త్రిముఖ సాయిబాబా విగ్రహావిష్కరణకు అంకురార్పణ జరిగింది. భక్తులు నిర్వహిస్తున్న సాయి నామ స్మరణలు, భజనలు (24/7) ఆదివారం ప్రారంభమయ్యాయి. కాకినాడకు చెందిన గురువు అంబూరి సాంబశివరావు పర్యవేక్షణలో సాయిదాసిని సత్యవేణి ఆధ్వర్యాన మందిరం, 120 అడుగుల త్రిముఖ సాయి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 1న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూల నుంచీ ఇప్పటికే సాయిబాబా భక్తుల రాక ఆరంభమైంది. వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని తుని – నర్సీపట్నం రోడ్డు పై నుంచి స్పష్టంగా చూడవచ్చని సాయి భక్తులు తెలిపారు. కొన్నేళ్లుగా ఇక్కడ సాయిబాబా మందిరాన్ని నిర్వహిస్తూండగా.. ఇప్పుడు స్థూపం నిర్మించి, దానిపై భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదే అత్యంత ఎత్తయిన త్రిముఖ సాయిబాబా విగ్రహమని చెప్పారు.
లోవలో ఆన్‌లైన్ సేవలు
ప్రారంభం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవ స్థానంలో ఆదివారం నుంచి ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆన్‌లైన్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి నాడు నిర్వహించే మహాచండీ హోమం, అమ్మవారి తిరు నక్షత్రం స్వాతి సందర్భంగా ని ర్వహించే పంచామృతాభిషేకాలతో పాటు ఊయ ల సేవ, వాహన పూజలు తదితర నిత్య సేవలకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశామన్నారు. కాటేజీలు, వసతి గదులు సైతం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు.
వేలాదిగా భక్తుల రాక
తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు క్యూలో దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.61775, పూజా టికెట్లకు రూ.91960, కేశఖండన శాలకు రూ.3,080, వాహన పూజలకు రూ.4,750, వసతి గదులు, కాటేజీల అద్దెలు రూ.36,020, విరాళాలు రూ.33,867, కలిపి మొత్తం రూ.2,31,452 ఆదాయం సమకూరిందని వివరించారు.


