
రవాణా.. ప్రైవేటు పథాన!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): టూ వీలర్ లేదా నాలుగు చక్రాలు ఆపైన సామర్థ్యం కలిగిన ఏ వాహనమైన రోడ్డెక్కాలంటే ముందుగా రవాణా శాఖ అధి కారుల దర్శనం చేసుకోవాల్సిందే. లేకుంటే ఆ వాహ నం రోడ్డెక్కే అవకాశమే ఉండేది కాదు. డ్రైవింగ్ లైసె న్స్, వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు తదితర అన్ని సేవలూ పదేళ్ల కిందట రవాణా శాఖ కార్యాలయాల్లోనే అందేవి. కొన్నేళ్లుగా ఈ సేవలను ప్రభుత్వం క్రమంగా ప్రైవేటు పరం చేస్తోంది. దీంతో, ఒకప్పుడు వందలాది మంది వాహనదార్లతో కళకళలాడిన ఆర్‌టీఓ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయి.
‘ప్రైవేటు’కు అప్పగించారిలా...
● గతంలో ఎవరైనా వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (ఆర్‌టీఏ) కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసేవారు. దీంతో, కొనుగోలుదార్లు అక్కడకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను మొదటి దశలో ప్రైవేటు రంగానికి అప్పగించారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చేశారు.
● స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి. రవాణా శాఖ విధుల్లో ఇది అత్యంత కీలకమైనది. కానీ, ఈ అధికారాన్ని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల (ఎంవీఐ) నుంచి తప్పించి, ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణాధికారం కూడా రవాణా శాఖ అధికారులకు లేకుండా చేశారు.
● ఇక మిగిలింది డ్రైవింగ్ లెసెన్స్‌ల జారీ. దీనిని కూడా డ్రైవింగ్ స్కూళ్లకు అప్పగించి, వారి ద్వారానే శిక్షణ కూడా ఇచ్చి లైసెన్సులు జారీ చేయించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
● మరోవైపు గతంలో వాహనాల పర్మిట్లు, టూరిస్టు వాహనాల పర్మిషన్లను కార్యాలయ పరిపాలనాధికారి స్థాయిలో మాన్యువల్‌గా చేసి జారీ చేసేవారు. ఈ సేవలను ఆన్‌లైన్ చేసి, అవసరమైన సమయానికి రుసుం చెల్లిస్తే కార్యాలయానికి వెళ్లకుండానే వీటిని జారీ చేస్తున్నారు.
● వాహనాల్లో సామర్థ్యానికి మించి సరకులు లోడ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పర్మిట్ల వంటి వాటిపై రవాణా అధికారులు గతంలో చెక్‌పోస్టుల వద్ద తనిఖీ చేసేవారు. ఇప్పుడు ఆ చెక్‌పోస్టులు ఎత్తివేశారు.
● ఇలా రవాణా శాఖ అధికారాలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేయడం లేదా కుదించడంతో అధికారులు కేవలం రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీ చేసి, చలానాలు రాయడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు ఎంవీఐ స్థాయి అధికారులు డెప్యూటేషన్‌పై వేరే శాఖకు వెళ్లాలని యోచిస్తున్నారు.
‘పరివాహన్’పై అవగాహన శూన్యం
కాగిత రహిత సేవలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర రవాణా శాఖ 2019లో పరివాహన్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రవాణా శాఖకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి 16 రకాల సేవలు పొందవచ్చు. కానీ, యాప్‌పై వాహన యజమానులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదు. ఈ యాప్ నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో వాహన యజమానులు పర్మిట్లు, లైసెన్సుల కోసం ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది. రవాణా శాఖలో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష పాసైన తర్వాత వచ్చిన మెసేజ్ ఆధారంగా వాహన చోదకులు మీ–సేవ కేంద్రాలకు వెళ్లి ఆ పత్రాలు తీసుకోవాల్సి వస్తోంది. వీటిని ఉచితంగా ఇవ్వాల్సిన నిర్వాహకులు రూ.20 నుంచి రూ.50 వరకూ వసూలు చేస్తున్నారు. అదే కార్డు రూపంలో కావాలంటే రూ.100 నుంచి రూ.150 వరకూ చెల్లించాల్సి వస్తోంది. టూ వీలర్, ఫోర్ వీలర్ లైసెన్సులు, రెన్యువల్‌కు వచ్చే వారికి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, ఆటో, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులకు వచ్చే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులే ఉంటారు. వారిని రవాణా కార్యాలయానికి తీసుకువెళ్లి ఓటీపీ చెప్పిన అనంతరం దరఖాస్తు చేయించాల్సి వస్తోంది. కాగిత రహితంగా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి పూర్తి విరుద్ధంగా ఈ తతంగమంతా సాగుతోంది.
ఏటీఎస్‌లు వద్దంటూ ఆందోళన
వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) ఏర్పాటు చేసింది. వాటి నిర్వాహకులు కావాల్సిన సర్టిఫికెట్‌ను బట్టి డబ్బులు డిమాండ్ ఆటో యూనియన్లు, రవాణా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే అధికారం రవాణా అధికారులకు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులకు అడ్డు లేకుండా పోతుంది. జిల్లా మొత్తానికి కాకినాడలో ఒకే ఒక్క ఏటీఎస్ ఏర్పాటు చేయగా జిల్లా సరిహద్దుల్లో ఉన్న వారు తమ వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీనివలన వారు అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు.
కార్యాలయాల్లో రద్దీ తగ్గింది
ఒకప్పుడు రవాణా శాఖ కార్యాలయాలకు ఉదయం నుంచి రాత్రి వరకూ నిత్యం వందలాది మంది వివిధ పనులపై వచ్చేవారు. క్రమేణా సేవలన్నీ ఆన్‌లైన్‌తో పాటు ప్రైవేటు పరం చేయడంతో కార్యాలయాల్లో రద్దీ తగ్గింది. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్ కేంద్రాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సేవలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు బండి కండిషన్ చూసి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏటీఎస్‌లు ఏర్పాటు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఇందులో మా పాత్రేమీ లేదు.
– కె.శ్రీధర్,
రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ), కాకినాడ
ఫ సేవలు ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం
ఫ డ్రైవింగ్ లైసెన్సు జారీని త్వరలో
అప్పగించే చాన్స్
ఫ జనం లేక వెలవెలబోతున్న
ఆర్‌టీఏ కార్యాలయాలు
జిల్లాలో వాహనాల వివరాలు
ప్రయాణికుల బస్సులు 489
స్కూల్ బస్సులు 1,494
గూడ్స్ క్యారియర్లు 13,546
మ్యాక్సీ క్యాబ్‌లు 481
మోటార్ క్యాబ్‌లు 1,730
ప్రైవేటు సర్వీస్ వెహికల్స్ 237
త్రీ వీలర్ (గూడ్స్) 3,484
ప్యాసింజర్ ఆటోలు 13,191
ట్రైలర్లు (కమర్షియల్) 3,491
కమర్షియల్ ట్రాక్టర్లు 912

రవాణా.. ప్రైవేటు పథాన!

రవాణా.. ప్రైవేటు పథాన!