
‘ఎత్తిపోతల’కు ముప్పు!
ఏలేరుపై ఆధారపడి మెట్ట ప్రాంతంలో సుమారు 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రభుత్వ మనసు పెట్టి పని చేస్తే రెండో పంటకు సైతం సాగునీరు అందుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు నుంచి ఐదేళ్లూ క్రమం తప్పకుండా రెండో పంటకు సాగునీరు అందించారు. అటువంటి ఏలేరు తెలుగు తమ్ముళ్ల స్వార్థానికి బలైపోతోంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెట్ట ప్రాంత రైతులకు మేలు చేసేలా అప్పటి మంత్రి తోట నరసింహం సోమవరం గ్రామం వద్ద ఏలేరులో ఎత్తిపోతల పంపింగ్ స్కీమ్ నిర్మించారు. ఇసుకాసురులు ఈ పథకం చుట్టుపక్కల ఏలేరు నదికి తూట్లు పొడిచేస్తున్నారు. ఇక్కడ మరికొన్ని రోజులు ఇసుక తవ్వకాలు ఇలాగే కొనసాగితే ఈ ఎత్తిపోతల పథకం ఏలేరులో కూలిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇసుక తవ్వకాలను శాశ్వతంగా నిలిపివేయాలని వారు కోరుతున్నారు. అడ్డగోలు తవ్వకాలతో ఏలేరులో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయని, దీనివలన కూడా శివారు ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలను కట్టడి చేయకుంటే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వగ్రామం ఇర్రిపాకతో పాటు కిర్లంపూడి మండలం బూరుగుపూడి, సోమవరం తదితర గ్రామాల్లోని ఆయకట్టు ప్రమాదంలో పడటం ఖాయమని చెబుతున్నారు.