పిఠాపురం: మల్లాం గ్రామంలోని ఒక ఇంట్లో వంట గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో మల్లెపాముల వీర నాగేశ్వరరావు ఇంట్లో పని చేస్తుండగా మంగళవారం అకస్మాత్తుగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో అతడితో పాటు, భార్య నాగలక్ష్మి, తమ్ముడు లోవరాజుకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఐదుగురు ఉన్నట్టు సమాచారం. చిన్న పిల్లాడు ఏడుస్తుండడంతో ఆ బాలుడితో పాటు మరో వ్యక్తి బయటకు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.