
కాజేసిన మొత్తం రూ.95 లక్షలు
కరప: కూరాడలో వేళంగి ఎస్‌బీఐ బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ) చిన్నం ప్రియభారతి మొత్తం రూ.95 లక్షల మేర మహిళాశక్తి సంఘాల సొమ్మును కాజేసినట్లు నిర్ధారణ అయ్యిందని వెలుగు ఏపీఎం ఎంఎస్‌బీ దేవి మంగళవారం రాత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 66 గ్రూపుల సభ్యులు బాధితులుగా ఉన్నారని చెప్పారు. కూరాడ గ్రామస్తులతో కలసి ఏపీఎం సోమవారం 39 గ్రూపులను తనిఖీ చేయగా బీసీ రూ.52 లక్షలు కాజేసిందని గుర్తించారు. మిగిలిన గ్రూపుల అకౌంట్లను మంగళవారం ఏపీఎం తనిఖీ చేశారు. కూరాడలో 106 మహిళాశక్తి సంఘాలున్నాయి. వీటిలో 40 గ్రూపుల వారు వేళంగిలోని యూనియన్ బ్యాంక్, ఎస్‌బీఐ బ్రాంచిల్లో తాము తీసుకున్న రుణాల వాయిదా, పొదుపు సొమ్ము జమ చేశారు. అక్కడకు వెళ్లలేని మిగిలిన 66 గ్రూపుల వారు కూరాడలోని ఎస్‌బీఐ బీసీ పాయింట్‌లో సొమ్ము చెల్లించేవారు. ఈ బీసీ పాయింట్‌ను ఆ గ్రామానికి చెందిన చెందిన ప్రియభారతి నిర్వహిస్తోంది. యానిమేటర్‌గా ఉన్న తన తల్లి మంగ సహకారంతో మహిళాశక్తి సంఘాలు చెల్లించే పొదుపు, వాయిదాల సొమ్మును పథకం ప్రకారం ఆమె కాజేసింది. ఎన్ని రోజులైనా రుణం తీరకపోగా ఇంకా బాకీ ఉన్నట్లు బ్యాంకు అధికారులు మహిళాశక్తి సంఘాల సభ్యులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై వారు గగ్గోలు పెట్టడంతో ఈ నెల 27న శ్రీమహిళాశక్తి సంఘాల సొమ్ము గోల్‌మాల్‌శ్రీ, 30న శ్రీతవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలుశ్రీ శీర్షికలతో శ్రీసాక్షిశ్రీ కథనాలు ప్రచురించింది. ఈ మేరకు ఏపీఎం సోమ, మంగళవారాల్లో ఆ గ్రామంలోని అన్ని గ్రూపుల అకౌంట్లను తనిఖీ చేశారు. కాజేసిన సొమ్ముతో బీసీ తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో ఒక ఇల్లు, కాకినాడలో ఒక ఇంటి స్థలం కొనుగోలు చేసినట్టు కూరాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అకౌంట్లను తనిఖీ చేసి స్వాహా అయిన సొమ్ము లెక్క తేల్చామని, తప్పులేమైనా ఉంటే సవరించి, ఎంత మేర అక్రమాలు జరిగాయో తుదిగా నిర్ధారించి, అన్ని ఆధారాలతో కరప పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేస్తామని ఏపీఎం దేవి తెలిపారు.
ఫ బాధితులు 66 గ్రూపుల సభ్యులు
ఫ కూరాడ బీసీ
అవినీతిని వెల్లడించిన ఏపీఎం