
రూ.3.41 కోట్లతో క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేందుకు స్క్రీనింగ్ బస్సును అందుబాటులోకి తీసుకు రానున్నామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. సీఎస్‌ఎఆర్ నిధులు రూ.3.41 కోట్లతో అత్యాధునిక సదుపాయాలు, అధునాతన వైద్య పరికరాలతో కూడిన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును జిల్లాకు ఇచ్చేందుకు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ముందుకు వచ్చింది. ఈ మేరకు కలెక్టర్‌కు ఆయన క్యాంపు కార్యాలయంలో బీపీసీఎల్ ప్రతినిధులు గురువారం ఒప్పంద పత్రాలు అందజేశారు. ఈ బస్సు మూడు నెలల్లో జిల్లాకు చేరుతుందని కలెక్టర్ తెలిపారు. బీపీసీఎల్ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బీపీసీఎల్ టెరిటరీ మేనేజర్ బి.సురేష్, సీపీఓ పి.త్రినాథ్ పాల్గొన్నారు.
ఇండియా స్కిల్స్ కాంపిటీషన్‌కు
దరఖాస్తుల ఆహ్వానం
రాజమహేంద్రవరం రూరల్: ఇండియా స్కిల్స్ కాంపిటీషన్‌లో ప్రతిభ చూపడానికి ఆసక్తి గల విద్యార్థులు, యువతీ యువకులు ఈ నెల 30లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జీవీడీ మురళి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు ట్రేడ్‌ను బట్టి 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారు అర్హులన్నారు. పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని గుర్తించిన 63 ప్రాధాన్య రంగాల్లో ప్రతిభ చూపే అవకాశాన్ని ఈ పోటీ కల్పిస్తుందన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, శిక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మేరా యువ భారత్ కార్యకర్తలు, ఐటీఐలు, డిప్లొమా/పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీలు తమ ఆధ్వర్యంలోని యువతను ఈ పోటీలో భాగస్వాముల్ని చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. https://www.skillindiadigital.gov.in/ account/register?returnUrl=%2Findia–skills–2025 వెబ్‌సైట్‌లో పోటీ జరిగే ట్రేడ్‌ల వివరాలు, వయోపరిమితి వివరాలు ఉంటాయని, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని మురళి తెలిపారు.
న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్‌కృష్ణ కోరారు. సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య వేదిక ఆధ్వర్యాన వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఆందోళన ఉధృతం చేయనున్నారు. దీనికి సంబంధించి రాజమహేంద్రవరంలోని సచివాలయ ఉద్యోగుల కార్యాచరణపై స్థానిక 48వ డివిజన్ సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు, సమయపాలన లేని టెలి కాన్ఫరెన్సులు, పదోన్నతులు, సర్వేలు, ఉద్యమ కార్యాచరణపై వార్డు కార్యదర్శుల అభిప్రాయం తీసుకున్నామని నిఖిల్‌కృష్ణ తెలిపారు. ఉద్యమ కార్యాచరణపై చర్చించామన్నారు.