
వేతన వేదన
● సమగ్ర శిక్షలో చాలీచాలని జీతాలు
● ఇబ్బందుల్లో కాంట్రాక్టు,
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు
● కనికరించని కూటమి పాలకులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమగ్ర శిక్షలో నిరుద్యోగులైన క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ (సీఆర్‌ఎంటీ), పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు మండల లెవెల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని వేతనాలతో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు, ఇంటి అద్దెలు, ఖర్చులతో దిక్కు తోచని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నా జీతాలు పెరగడం లేదని ఆందోళన చెందుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును పాలకులు అమలు చేయకపోవడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లావ్యాప్తంగా మండల వనరుల కేంద్రాల్లో 220 మంది పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు, 81 మంది సీఆర్‌ఎంటీలు (వీరిలో ఇద్దరు మరణించారు), 24 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 19 మంది మండల లెవెల్ అకౌంటెంట్లు, 24 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 24 మంది మెసెంజర్లు పని చేస్తున్నారు. వీరందరూ 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో వీరికి నెలకు రూ.18,500 వేతనం చెల్లించేవారు. తరువాత వచ్చిన పాలకులు వీరి జీతాల పెంపును విస్మరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వీరి వేతనాన్ని 2020లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.23,500కు పెంచారు.
కక్ష కట్టినట్టు కూటమి తీరు
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా కాంట్రాక్టు అవుట్‌సో ర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్‌స్కేల్ వర్తింపజేయరాదని ఈ ఏడాది జనవరిలో జీఓ నంబర్–2 విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల్లో మంజూరైన ఖాళీ పోస్టుల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే అర్హులని పేర్కొంది. రాజ్యాంగం కల్పించిన సమాన హక్కు సూత్రానికి ఈ జీఓ విరుద్ధమని సమగ్ర శిక్ష సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు అమలు కావడం లేదని వాపోతున్నారు.
అమలు కాని హామీలు
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు గొప్పగా ప్రకటించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత షరా మామూలుగానే మొండిచేయి చూపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్, కొత్త రేషన్ కార్డులు, తల్లికి వందనం వంటి పథకాలను సమగ్ర శిక్షలో పని చేస్తున్న చిరుద్యోగులకు వర్తింపజేయలేదు. ప్రభుత్వం ఓవైపు ఇలా అన్యాయం చేస్తూండగా.. ఇప్పటికే నిత్యావసరాల ధరలు, రవాణా, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరగడంతో ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. తమకు వెంటనే జీతం పెంచాలని, దీంతో పాటు రిటైర్మెంట్ వయసు పెంపు, ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్, సంక్షేమ పథకాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల వంటివి ప్రత్యేకంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
లోకేష్ సార్.. ట్వీట్ మరిచారా!
గత ప్రభుత్వ హయాంలో 2023 డిసెంబర్ నెలలో మినిమమ్ టైమ్‌స్కేలు అంశంపై సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రస్తుత రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ అప్పట్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళనకు టీడీపీ సంఘీభావం తెలియజేస్తోందని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ట్వీట్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నాడు మద్దతు తెలిపి, నేడు అధికారంలోకి వచ్చిన తరువాత తమను పట్టించుకోవడం లేదని చిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేతనాలు పెంచాలి
జీతాలు పెరగక ఇబ్బందులు పడుతున్నాం. నిత్యావసర ధరలు, రవాణా, వైద్యం, ఇంటి అద్దె వంటి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కుటుంబ పోషణ భారమవుతోంది. నెలవారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మా జీతాలు పెంచాలి.
– తరాల మీరాసాహెబ్
సీఆర్‌పీల సంఘం జిల్లా అధ్యక్షుడు
ఉద్యోగ భద్రత కల్పించాలి
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను విద్యా శాఖలో విలీనం చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నాం. ఉపాధ్యాయుల మాదిరిగానే సెలవులు వర్తింపజేయాలి. ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచి, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి.
– ఎ.రాంజీ ప్రసాద్,
సీఆర్‌పీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

వేతన వేదన

వేతన వేదన

వేతన వేదన