
ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు చండీహోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి గావించారు. వేద పండితులు వేదుల సూర్యనారాయణ, ఉపాధ్యాయుల రమేష్, వనదుర్గ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు చెళ్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి పరిచారకుడు నరసింహమూర్తి ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు.