
అమ్మను మరువకండి
● రోజుకు 24 నిమిషాలు కేటాయించండి
● పరిపూర్ణానంద స్వామి
● శ్రీపీఠంలో 60 కోట్లకు చేరిన
కుంకుమార్చనలు
● 50 వేల మంది మహిళలు హాజరు
కాకినాడ రూరల్: ‘అమ్మ ఒక శక్తి. అమ్మ ఒక అద్భుతం. అన్నీ ఉన్నా అమ్మను మాత్రం మరువకండి. ప్రతి రోజూ గంటకు ఒక నిమిషం చొప్పున 24 నిమిషాలు అమ్మకు కేటాయించి, ఆమెను స్మరిస్తే మీ మెదడులో గామా వేవ్స్ యాక్టివేట్ అవుతాయి. మహా ఆనందం కలుగుతుంది’ అని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. రమణయ్యపేటలోని శ్రీపీఠంలో మహాశక్తి యాగం మూడో సంవత్సరం వంద కోట్ల కుంకుమార్చనలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐదో రోజు శుక్రవారం, పంచమి రావడంతో సుమారు 50 వేల మంది మహిళలు దీక్షా వస్త్రాలతో ఈ పూజలకు తరలివచ్చారు. వారి సంఖ్యకు తగినట్టుగా కుంకుమ పూజలకు ఏర్పాట్లు చేసి, అనంతరం మహా ప్రసాదం అందించారు. పీఠం అధిష్ఠాన దేవత ఐశ్వర్యాంబిక అమ్మవారు శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సౌభాగ్య పూజ, సాయంత్రం దుర్గా సూక్త, ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, శ్రీపీఠం సీ్త్ర శక్తి పీఠమని, ఇక్కడ ఐశ్వర్యాంబిక అమ్మవారు అన్నీ నడిపిస్తున్నారని అన్నారు. వందల కోట్ల కుంకుమార్చనలు జరిగే తపో భూమిగా ఈ ప్రాంతం మారిందని చెప్పారు. ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఏదో ఒక తపస్సు జరిగి ఉంటుందని, లేకపోతే ఇన్ని వేల మందితో పూజలు జరుగుతాయా అని అన్నారు. 64 లక్షల కోట్ల తపస్సుల సారమే లలితా సహస్ర నామాలు అని చెప్పారు. అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని ఆశీర్వదించారు.
అయోధ్య బాలరాముని విగ్రహానికి పూజలు
శ్రీపీఠంలో వంద కోట్ల కుంకుమార్చనల వేదికకు అయోధ్యలో స్థిరపడిన చల్లా శ్రీనివాసశాస్త్రి అక్కడి నుంచి బాలరాముని బంగారు ఉత్సవ విగ్రహం, పాదుకలు, ధనుర్బాణాలు తీసుకు వచ్చారు. వాటికి పరిపూర్ణానంద స్వామి పూజలు చేశారు. మహాశక్తి యాగంలో అయోధ్య రాముని ఆయుధాలు, పాదుకలు రావడం ఆనవాయితీగా వస్తోందని, ఈసారి ఆయననే స్వయంగా విగ్రహంగా వచ్చారని చెబుతూ, ఒక్కొక్కటీ భక్తులకు చూపించారు. మొదటి సంవత్సరం పాదుకలు, రెండో సంవత్సరం ధనుర్బాణాలు, మూడో సంవత్సరం స్వయంగా బంగారు రాముడే వచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. స్వామి వారి కోసం అనేక విగ్రహాలు తంజావూరులో తయారు చేయిస్తున్నానని, అయోధ్య వచ్చేవారికి వసతి, భోజనం ఉచితంగా ఏర్పాటు చేస్తానని చల్లా శ్రీనివాసశాస్త్రి తెలిపారు.
ఐశ్వర్య రక్ష కంకణాలకు పూజ
మహాశక్తి యాగంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న భక్తులకు తన తల్లి దాచుకున్న సొమ్ముతో ఐశ్వర్య రక్ష కంకణాలు తయారు చేయించి, అందించనున్నట్లు పరిపూర్ణానంద స్వామి ముందుగానే ప్రకటించారు. ఆ మేరకు స్వచ్ఛమైన రాగితో తయారు చేసిన కంకణాలను మహాశక్తియాగం వేదికపై లలితా అమ్మవారి విగ్రహం ముందుంచి పూజలు నిర్వహించారు.
కుంకుమార్చనల్లో పాల్గొన్న మహిళలు
కుంకుమ పూజలకు తరలివస్తున్న భక్తులు

అమ్మను మరువకండి

అమ్మను మరువకండి