
మహాలక్ష్మీ నమోస్తుతే
అన్నవరం: శరన్నవరాత్ర వేడుకలను పురస్కరించుకుని ఐదో రోజైన శుక్రవారం సత్యదేవుని సన్నిధిలో రత్నగిరి దుర్గామాతలైన వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లు సిరులొసంగే శ్రీమహాలక్ష్మిగా అలంకరించి పూజలు చేశారు. పద్మంలో ఆశీనులై, ఆకుపచ్చ రంగు చీరలు ధరించి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారితో పాటు వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దర్బారు మండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ రుత్విక్కులు శ్రీసూక్త, పురుషసూక్త, మన్యుసూక్త, లలితా, విష్ణు సహస్రనామ పారాయణలు చేశారు. లింగార్చన, నవావరణార్చన, సూర్య నమస్కారాలు నిర్వహించారు. యంత్రాలయంలో శ్రీమహా వైకుంఠ నారాయణ విభూతి యంత్రానికి పూజలు చేశారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ సత్యదేవుని ప్రధానాలయంతో పాటు, వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్ల ఆలయాల్లో లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ సత్యదేవుని ప్రధానాలయంలో అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగబాబు, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
లోవలో..
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారిని కూడా మహాలక్ష్మీదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దాపురం ఆర్‌డీఓ కె.శ్రీరమణి, పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. దసరా వేడుకల్లో ఆరో రోజైన శనివారం అమ్మవారిని లలితాదేవిగా అలంకరించనున్నట్లు వేదపండితులు, ప్రధానార్చకులు తెలిపారు.

మహాలక్ష్మీ నమోస్తుతే

మహాలక్ష్మీ నమోస్తుతే