
వ్యక్తిగత విమర్శలు మానుకోండి
వైఎస్సార్ సీపీ నేత వంగా గీతా విశ్వనాథ్
పిఠాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీతా విశ్వనాథ్ తీవ్రంగా ఖండించారు. ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సభను అగౌరపరచడమేనని మండిపడ్డారు. ఆమె ఇక్కడ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పవిత్రమైన చట్టసభలో ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఇతర నాయకుల వ్యక్తిగత జీవితాలపై లేనిపోని మాటలు మాట్లాడటం సరికాదన్నారు. వైఎస్ జగన్ ప్రజల కోసం అహర్నిశలూ కృషి చేస్తూనే ఉంటారని, అటువంటి నాయకుడిపై నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని గీత హితవు పలికారు. ఏళ్ల తరబడి సీఎంగా పని చేసిన చంద్రబాబు హయంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ పేరును కనీసం ఒక జిల్లాకు పెట్టలేకపోయారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ మాత్రమే ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టారని, దీనిని బట్టి ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలని అన్నారు. వైఎస్ జగన్‌పై నోటికొచ్చినట్టు మాట్లాడటం మా నుకోవాలన్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చాలా సౌమ్యుడని, ఎప్పుడూ ఒక అడుగు తగ్గే ఉంటారన్నారు. వైఎస్ జగన్, చిరంజీవి ఎదుటి వారిని గౌరవించే వ్యక్తులని, ఎవ్వరినీ తక్కువ చేయాలనుకునే వారు కాదని స్పష్టం చేశారు. ఆ ఇద్దరినీ చాలా తేలికగా మాట్లాడటం చాలా తప్పని అన్నారు. మహేష్ బాబు డైలాగ్‌లా ‘ఎవరైనా అబద్ధం ఆడొచ్చు. కానీ గూగుల్ తల్లి అబద్ధం ఆడదు. మీకు అనుమానం ఉంటే గూగుల్‌లోకి వెళ్లి రికార్డులు తీసి చూడండి. ఎవరేం చేశారో తెలుస్తుంది’ అని గీత సూచించారు.
జీఎస్టీ తగ్గింపుపై
అవగాహన కార్యక్రమాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జీఎస్టీ తగ్గింపుపై ఈ నెల 27 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ అంశంపై కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జీఎస్టీపై హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. జీఎస్టీ తగ్గింపుతో ఏ మేరకు లబ్ధి కలుగుతుందో ఇంటింటికీ వెళ్లి తెలియజేయాలన్నారు. ప్రతి వారం ఒక థీమ్ తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ జె.వెంకటరావు, జీఎస్టీ జాయింట్ కమిషనర్ డి.శ్రీలక్ష్మి, జెడ్పీ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, డీపీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎగసిపడుతున్న అలలు
తొండంగి: అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతంలో మండలంలోని దానవాయిపేట, అద్దరిపేట, కొత్తచోడిపల్లిపేట తీరాల్లో సముద్ర అలలు రెండు మీటర్ల వరకూ ఎగసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంలో వేటకు వెళ్లరాదని తుని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్ ఉమామహేశ్వరరావు సూచించారు.

వ్యక్తిగత విమర్శలు మానుకోండి