
ధాన్యం కొనుగోలుపై అవగాహన అవసరం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై అధికారులకు అవగాహన అవసరమని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు శిక్షణ తరగతులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ధాన్యం కొనుగోలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నాణ్యతా ప్రమాణాల అమలు, కనీస మద్దతు ధర, గోనె సంచులు, మండల స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ ఏర్పాటు, కస్టోడియన్ అధికారుల నియామకం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వాహనాల ద్వారా రైస్ మిల్లులకు తరలింపు, ఈ–క్రాప్ బుకింగ్ వంటి అంశాలపై మండల స్థాయి అధికారులకు జేసీ అవగాహన కల్పించారు. జిల్లాలో 269 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో అవసరమైన సిబ్బంది, తేమ శాతం కొలిచే యంత్రాలు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. దళారులు, మిల్లర్ల చేతిలో నష్టపోకుండా కనీస మద్దతు ధర పొందేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకూ 85 శాతం ఈ–పంట నమోదు పూర్తయిందని, మిగిలినది ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.దేవల నాయక్, జిల్లా పౌరసరఫరాల అధికారి సత్యనారాయణరాజు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ్ కుమార్, కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు, జిల్లా సహకార అధికారి బి.శ్రీనివాసరెడ్డి, లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కమిషనర్ ఎన్.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.