
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం కూటమి ప్రభుత్వానికి దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కె.ఆదిత్య కుమార్ అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా లీగల్ సెల్ ఆధ్వర్యాన న్యాయవాదులు కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య కుమార్ మాట్లాడుతూ, ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఉండాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోట్లాది రూపాయలతో వాటి నిర్మాణం చేపట్టారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ కళాశాలల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. విద్య, వైద్యం రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిన హక్కని, వీటిని ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటని అన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో ఎంతోమంది ప్రాణాలు నిలిపారన్నారు. ఆ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు మాత్రం ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాయని గుర్తు చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలకు ప్రభుత్వాసుపత్రులు ఎంతో మేలు చేస్తాయని ఆదిత్య కుమార్ అన్నారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు లీగల్ సెల్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో లీగల్ సెల్ కాకినాడ సిటీ అధ్యక్షుడు గెద్దాడ వెంకటేశ్వరరావు, నాయకులు విశ్వనాథరెడ్డి, బాలకృష్ణ, నాగేంద్ర, పితాని శ్రీనివాస్, కలిదిండి శ్రీనివాస్, నున్న కృష్ణ, గెడ్డం శ్రీనాథ్, జి.వరప్రసాద్, ఎంజీకే రాజు, మహిళా న్యాయవాదులు కళ, ప్రసన్న, శ్వేత పాల్గొన్నారు.